వైసిపి ఎంఎల్ఏల సంఖ్య పెరగబోతోందా  ?

Vijaya

చదవటానికి  ఆశ్చర్యంగానే ఉంది. కానీ వైసిపి నేతలు చెప్పిన విషయాన్ని లోతుగా ఆలోచిస్తే మాత్రం వైసిపి ఎంఎల్ఏల సంఖ్య పెరుగుతుందనే అనిపిస్తోంది. వైసిపి ఎంఎల్ఏ జోగి రమేష్ మీడియాతో మాట్లాడుతూ  వైసిపి ఎంఎల్ఏల సంఖ్య తొందరలో 151 నుండి 152 లేకపోతే 153కో పెరగబోతోంది అని స్పష్టంగా ప్రకటించారు. అధికారపార్టీ ఎంఎల్ఏల సంఖ్య ఎలా పెరుగుతుంది ? అన్నదే ఇపుడు సస్పెన్సుగా మారింది.

ఇక్కడ విషయం గమనిస్తే మొన్నటి ఎన్నికల్లో వైసిపి 151 ఎంఎల్ఏలు గెలుచుకున్న విషయం అందరికీ తెలిసిందే. టిడిపి 23 మంది ఎంఎల్ఏలకు మాత్రమే పరిమితమైంది. అయితే తెలుగుదేశంపార్టీకి చెందిన ఇద్దరు ఎంఎల్ఏలు వల్లభనేని వంశీమోహన్, మద్దాలి గిరిధర్ పార్టీకి దూరమయ్యారు. చంద్రబాబునాయుడు మీద తిరుగుబాటు లేవదీయటంతో వంశీని పార్టీ సస్పెండ్ చేసింది. గిరి విషయం ఇంకా అంతదాకా పోలేదు కానీ టిడిపికి దూరమైపోయినట్లే.

బహుశా ఈ ఇద్దరు ఎంఎల్ఏలు తొందరలోనే తమ పదవులకు రాజీనామాలు చేయబోతున్నారా ? అనే సందేహం మొదలైంది రమేష్ తాజా వ్యాఖ్యలతో.  వంశీ గనుక రాజీనామా చేస్తే వైసిపి తరపున టికెట్ ఇవ్వటానికి ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి అంగీకరించారు. ఇందులో భాగంగానే మొన్నటి ఎన్నికల్లో వంశీపై పోటి చేసిన యడ్లపాటి వెంకట్రావుకు కీలక పదివిని అప్పగించి జగన్ లైన్ క్లియర్ చేశారు.

సిఎంను గిరి కలిసి రెండు రోజులే అయ్యింది కాబట్టి ఇంకా స్పష్టత రావాల్సుంది. దాదాపు 40 నిముషాల భేటిలో  ఎంఎల్ఏ పదవికి రాజీనామా చేయటం, మళ్ళీ టికెట్ ఇవ్వటం, పోటి చేయటం లాంటి అంశాలపై మాట్లాడుకుని ఉండచ్చు. సరే టికెట్ ఇవ్వటం పోటిలోకి దింపటం అన్నది జగన్ నిర్ణయం. కానీ ఒకసారి ఉపఎన్నికంటూ వస్తే మళ్ళీ వీళ్ళిద్దరే గెలుస్తారా ? అంటే గ్యారెంటీ లేదు.

మొన్నటి వరకూ వైసిపి తరపున ఎవరు పోటి చేసినా గెలుపు గ్యారెంటీ అని చెప్పేవాళ్ళేమో. కానీ తాజాగా మొదలైన రాజధాని రగడ  తర్వాత ఉపఎన్నికలంటూ వస్తే ఏమవుతుందో చెప్పలేకున్నారు. కాకపోతే తామే గెలుస్తామన్న ధైర్యం జోగి రమేష్ లో ఉందేమో.  అంటే వంశీ, గిరి తొందరలోనే రాజీనామాలు చేయటం, ఉపఎన్నికల్లో పోటి చేయటం ఖాయమనే అనుకోవాలి. అందుకనే వైసిపి ఎంఎల్ఏల బలం మరో రెండు పెరుగుతుందని చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: