ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం... విశాఖ మెట్రో ఫైనాన్షియల్ బిడ్ రద్దు... !

Reddy P Rajasekhar

ఏపీ ప్రభుత్వం విశాఖ మెట్రో ఫైనాన్షియల్ బిడ్ ను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త కన్సల్టెంట్ కు నూతన డీపీఆర్ సిద్ధం చేయటానికి బాధ్యతలు అప్పగించింది. గతంలో విశాఖ మెట్రో కోసం కేవలం ఒక్క బిడ్ మాత్రమే దాఖలైంది. ఈ బిడ్ ను ఇస్సెల్ ఇన్ ఫ్రా కన్సార్టియం దాఖలు చేసింది. ప్రభుత్వం పాత టెండర్లను రద్దు చేసి కొత్త టెండర్లను పిలవాలని నిర్ణయం తీసుకుంది. 
 
అమరావతి మెట్రో రైల్ కార్పొరేషన్ అధికారులు టెండర్ల ప్రక్రియను నిర్వహించేందుకు కసరత్తు చేశారు. తొలిదశలో విశాఖ మెట్రో రైలును గాజువాక వరకే ఆపాలనే ప్రతిపాదన ఉన్నా ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ స్టీల్ ప్లాంట్ వరకు పొడిగించాలనే డిమాండ్ మేరకు ప్రక్రియ ప్రారంభం కానుంది. ఫస్ట్ ఫేజ్ లో అదనంగా నాలుగు కిలోమీటర్లు పెరగడంతో పాటు అంచనా వ్యయం కూడా పెరిగింది. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కు విశాఖకు తరలిస్తారని ప్రచారం జరుగుతున్న సమయంలో ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకోవడం గమనార్హం. 
 
విభజన సమయంలో పునర్విభజన చట్టం మేరకు విశాఖ మెట్రో రైలు ఏర్పాటుపై నిర్ణయం తీసుకున్నారు. అమరావతి మెట్రో రైలు సంస్థ మెట్రో ఏర్పాటు బాధ్యతలను తీసుకుంది. మూడు కారిడార్లుగా 8300 కోట్ల రూపాయలతో 42.55 కిలోమీటర్ల మేర ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతో ఈ ప్రాజెక్టును చేపట్టాలని నిర్ణయం తీసుకొని 4200 కోట్ల రుణానికి ప్రతిపాదనలతో పాటు 12 ఎకరాల ప్రైవేట్ భూమిని 83 ఎకరాల ప్రభుత్వ భూమిని సేకరించే బాధ్యత ప్రభుత్వానికి అప్పగించారు. 
 
ఇదే సమయంలో ఫైనాన్షియల్ బిడ్ దాఖలు కాగా బిడ్ ను రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తాజాగా విశాఖ మెట్రో రైలుపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ముఖ్యమంత్రి అధికారుల ద్వారా ఫైనాన్షియల్ బిడ్ దాఖలు చేసిన ధరను తగ్గించుకోవాలని సూచనలు చేశారు. ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం వలన మెట్రో రైలు ఆలస్యం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వం విశాఖ మెట్రో ఫైనాన్షియల బిడ్ ను రద్దు ఛేయటంపై రాజకీయ వర్గాల్లో, ప్రజల్లో చర్చ మొదలైంది. 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: