బాబోరి తుగ్లక్ మాటెనకింత కదుందహే !
నా అనుభవమంతా లేదు నీ వయస్సు .. నలభై ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నా... రాజకీయాల్లో నా అంత సీనియర్ లేడు... ఎన్టీఆర్ కంటే నేనే సీనియర్.. హైదరాబాద్ ను నేనే నిర్మించా .. ఇండియాకు టెక్నాలజీ పరిచయం చేసింది నేనే.. సెల్ ఫోన్ నేనే తీసుకొచ్చా ఇలా అన్నిటిలో నేనే నేనే అంటూ హడావుడి చేసే వ్యక్తి ఎవరో మీకు ఈ పాటికే అర్ధం అయిపోయి ఉండాలి. అర్ధం కాకపోతే వెంటనే మీరు టీడీపీ అధినేత చంద్రబాబు గురించి తెలుసుకోవాల్సిందే. లేని గొప్పలు చెప్పడం, తన చేయని పనికి కూడా క్రెడిట్ పొందాలనుకోవడం చంద్రబాబు నాయుడు స్టైల్. ఆయన రాజకీయ జీవితాన్ని ఒకసారి పరిశీలిస్తే ఈ విషయాలన్నీ అర్ధం అవుతాయి. ముందు ఆవేశంగా ప్రకటను చేయడం ఆ తరువాత యూ టర్న్ తీసుకోవడం ఆయనకు అలవాటుగా మారిందనే విమర్శలు ఎక్కువగా వినిపిస్తున్నాయి.
ప్రతి విషయంలోనూ చంద్రబాబు యూటర్న్ తీసుకుంటూనే ఉన్నారు. ప్రస్తుతం తెలుగు దేశం పార్టీ ప్రతిపక్షంలో ఉంది. రాజకీయంగా అనేక ఇబ్బందులు ఎదుర్కుంటోంది. పార్టీ పరిస్థితి అంతంతమాత్రంగానే ఉండడంతో చాలామంది నాయకులు తెలుగుదేశం పార్టీని వీడి బయటకు వెళ్లేందుకు ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పార్టీలో వలసలను నిరోధించేందుకు చంద్రబాబు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకే ప్రభుత్వం మీద సందర్భం ఉన్నా, లేకపోయినా, ఆరోపణల్లో బలం ఉన్నా, లేకపోయినా ఏదో ఒక లోపాన్ని తెరపైకి తీసుకువస్తూ మీడియాలో హైలెట్ అయ్యేలా కనిపిస్తూ పార్టీ నాయకులకు భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాడు.
ఈ క్రమంలో బాబు తీసుకుంటున్న యూటర్న్ రాజకీయాలు విమర్శల పాలవుతున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టే విషయంలో వైసీపీ ప్రభుత్వం ముందడుగు వేయగా, ఆ విషయంలో చంద్రబాబు, ఆ పార్టీ నాయకులు తీవ్రస్థాయిలో ప్రభుత్వంపై విమర్శలు చేశారు. తెలుగు భాష ను తెలుగు ప్రజలకు దూరం చేస్తారా అంటూ మండిపడ్డారు. కానీ ఈ అంశం పై ప్రజల్లో సానుకూల దృక్పథం ఏర్పడి తిరిగి తెలుగుదేశం పైనే విమర్శలు చెలరేగడంతో ఒక్కసారిగా బాబు యూటర్న్ తీసుకున్నారు.
ఇక తెలుగుదేశం ప్రభుత్వంలో సి.బి.ఐ ఏపీ లోకి రాకుండా నిషేధం విధించారు చంద్రబాబు. అయితే అధికారం పోగానే మళ్లీ యూటర్న్ తీసుకున్నారు. జగన్ బాబాయ్ వైఎస్ వివేకా హత్య కేసులో సిబిఐ విచారణ కావాలంటూ బాబు పట్టుబట్టారు. ఇక రాజధాని ఈ విషయంలోనూ ఇదే విధమైన వ్యవహార శైలిని కనబరిచారు. ముందు మూడు రాజధానులు అంశాన్ని తీవ్రంగా వ్యతిరేకించినా రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో తెలుగుదేశం పార్టీపై తీవ్ర వ్యతిరేకత ఎదురవడంతో వెంటనే సైలెంట్ అయిపోయారు. అమరావతిలో రాజధాని రైతులు ఆందోళన చేస్తున్నా బాబు ఒక్కసారి కూడా వారిని కలిసేందుకు ప్రయత్నించలేదు.
అలా కలిస్తే మిగతా రెండు ప్రాంతాల్లోనూ తీవ్ర వ్యతిరేకత వస్తుందని భావంతో సైలెంట్ అయిపోయారు. కానీ ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం రాజధాని విషయంలో కాస్త వెనకడుగు వేస్తున్నట్టు గా కనిపించగానే ఒక్కసారిగా బాబు లోని మరో కోణం బయటకు వచ్చింది. ఇదే విషయమై ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ యూటర్న్ రాజకీయాలకు మరింత పదును పెట్టే దిశగా చంద్రబాబు అలా ముందుకు వెళ్తూనే ఉన్నాడు.