తిరుపతిలో సంక్రాంతి నుండి అది కనిపించదు..?
తిరుమల తిరుపతి దేవస్థానానికి ఎంత గొప్ప చరిత్ర ఉందో అందరికీ తెలిసిందే. భక్తుల కోరికలు తీర్చే బంగారు దేవుడిగా తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీవారు విరాజిల్లుతారు. తిరుమల తిరుపతి దేవస్థానం కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందినది. తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా దేశం నలుమూలల నుండి ఎంతో మంది భక్తులు ఇక్కడికి వచ్చి శ్రీవారిని దర్శించుకుంటూ ఉంటారు. ఇక శ్రీవారి దర్శనానికి ఎంత మంది భక్తులు వచ్చినా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటారు ఆలయ సిబ్బంది. తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీవారిని దర్శించుకుంటే తమ సకల పాపాలు తొలగిపోయి పుణ్యం వస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం.
ఇకపోతే తిరుమల తిరుపతి దేవస్థానానికి ప్రతిరోజు భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుందన్న విషయం తెలిసిందే. భక్తులు ఎంతమంది వచ్చినా తిరుమల వారి దేవస్థానం ని ఎప్పుడు పరిశుభ్రంగా ఉంచేందుకు ఆలయ సిబ్బంది నిరంతరం చర్యలు చేపడుతున్నారు. భక్తుల రద్దీ ఎంత ఉన్నప్పటికీ.. ఆలయ పరిసరాలన్నీ పరిశుభ్రంగా ఉంచేందుకు ఆలయ అధికారులు చర్యలు చేపడుతు ఉంటారు . అయితే తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్లాస్టిక్ ను నిషేధించడానికి చర్యలు చేపట్టినప్పటికీ... అక్కడక్కడా ప్లాస్టిక్ వాడకం మాత్రం కనిపిస్తూ ఉంటుంది. అయితే తిరుమల వారి దేవస్థానం లో పూర్తిగా ప్లాస్టిక్ నిషేధించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ వై వి సుబ్బారెడ్డి నడుం బిగించారు.
పరమ పవిత్రమైన తిరుమల తిరుపతి పుణ్యక్షేత్రం అత్యంత పరిశుభ్రం ప్రదేశంగా తీర్చిదిద్దాలని నిర్ణయించినట్లు టీటీడీ చైర్మన్ వై వి సుబ్బారెడ్డి పునరుద్ఘాటించారు. సంక్రాంతి తర్వాత తిరుమలలో పూర్తిస్థాయిలో ప్లాస్టిక్ నిషేధాన్ని అమలు చేస్తామని ఆయన వెల్లడించారు. ప్లాస్టిక్ బాటిళ్లు ప్లాస్టిక్ సంచులను నిషేదిస్తున్నామని తెలిపారు వై.వి.సుబ్బారెడ్డి. ప్లాస్టిక్ సీసాలు వినియోగానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో భాగంగా తిరుమల వ్యాప్తంగా మంచినీటి కేంద్రాలను ఏర్పాటు చేస్తామని ఆయన వెల్లడించారు. తిరుమలలో నీటి కొరత ఇబ్బంది లేదని... మరో రెండేళ్ల వరకు సరిపడా నీటిని నిల్వలు అందుబాటులో ఉన్నాయి అంటూ ఆయన స్పష్టం చేశారు.