కాంగ్రెస్ పార్టీ తల్లిలాంటిది... ఆ తల్లి కొడుకులలో ఒకరు కేసీఆర్ : కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ కాంగ్రెస్ పార్టీలో పుట్టి పెరిగి బయటకు వెళ్లాడని అన్నారు. ఈరోజు అనేక రాజకీయ పార్టీల్లో ఉన్నవాళ్లు కాంగ్రెస్ పార్టీలో పుట్టి వెళ్లినవాళ్లే అని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ తల్లిలాంటిది... అనేకమంది కొడుకులను కన్నది... ఆ కొడుకులలో ఒకరు కేసీఆర్ అని అన్నారు. ఆ విషయం కేసీఆర్ కుటుంబం మరిచిపోకూడదని జగ్గారెడ్డి చెప్పారు.
కాంగ్రెస్ పార్టీ చరిత్రలో ఒకరికి భయపడే పరిస్థితి ఎప్పుడూ లేదని జగ్గారెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీకి, టీఆర్ ఎస్ పార్టీకి తేడా ఏమిటంటే వాళ్ల దగ్గర డబ్బులు ఉన్నాయని, ఎన్నికల అధికారులు ఉన్నారని, పోలీస్ అధికారులు ఉన్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి మున్సిపల్ ఎన్నికల్లో 60 నుండి 70 సీట్లు వస్తాయని అందులో ఎలాంటి అనుమానం లేదని జగ్గారెడ్డి అన్నారు.
ఎన్నికల అధికారి నాగిరెడ్డి టీఆర్ ఎస్ పార్టీ కార్యకర్తగా వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే చర్యలు తీసుకుంటుందని అన్నారు. మున్సిపల్ ఎన్నికలను ఎదుర్కోవడానికి తాము సిద్ధంగా ఉన్నామని జగ్గారెడ్డి అన్నారు. మున్సిపల్ ఎన్నికలు గతానికి భిన్నంగా జరుగుతున్నాయని జగ్గారెడ్డి అన్నారు. ఎన్నికల కమిషన్ అంటే తమకు గౌరవం ఉండేదని ఒక నమ్మకం ఉండేదని అన్నారు.
ఎన్నికల కమిషన్ ఓటర్లను దృష్టిలో పెట్టుకుని ప్రక్రియ చేయాలని ఎన్నికల అధికారులు టీఆర్ ఎస్ కార్యకర్తలలా కనిపిస్తున్నారని అన్నారు. మొదట ఓటర్ల జాబితా విడుదల చేయాలని విడుదల చేసిన తరువాత ఒక వారం సమయం ఇవ్వాలని అన్నారు. ఎలక్షన్ కమిషన్ టీఆర్ ఎస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తుందని అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో ఓటర్లను తొలగిస్తున్నారని అన్నారు. మున్సిపాలిటీలకు జీవోలు విడుదల చేస్తూ నిధులు విడుదల చేశారని కానీ నిధులు మాత్రం విడుదల కాలేదని అన్నారు. నాగిరెడ్డిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని జగ్గారెడ్డి అన్నారు. జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలపై టీఆర్ ఎస్ పార్టీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.