
జ’గన్’ : నమ్మిన వారికి అందలం.. పుష్ప శ్రీవాణికి ఊహించని ప్రమోషన్..!
రాజకీయాల్లో ఉన్న వారికి నమ్మకమే ఊపిరి. అది ప్రజల నుంచి కావొచ్చు.. పార్టీలోని ద్వితీయ శ్రేణి నాయ కుల నుంచి కావొచ్చు. అధినేతలకు నమ్మకమే ఆలంబన. ఇలాంటి నమ్మకం పెంచుకున్న వారికి అధినే తలు కూడా అంతే నమ్మకంగా కీలక పదవులు అప్పగించిన పరిస్థితి ఏపీ రాజకీయాల్లో అనేక సంఘటనలు నిరూపిస్తున్నాయి. తాజాగా ఏపీలో ఏర్పడిన జగన్ ప్రభుత్వంలోనూ ఇలాంటి నమ్మకస్తులకు జగన్ వీరతాళ్లు వేశారు. కీలకమైన పదవులు అప్పగించారు. వారిలో ప్రధానంగా చెప్పుకొవాల్సింది కురుపాం నియోజకవర్గం నుంచి వరుస విజయాలు కైవసం చేసుకున్న పుష్ప శ్రీవాణి.
వయసులో చిన్న వారే అయినా.. రాజకీయంగా జగన్‌కు అత్యంత నమ్మకంగా ఉన్న నాయకుల్లో ఒకరుగా పుష్ప శ్రీవాణి గుర్తింపు సాధించారు. వైఎస్ హయాం నుంచి కూడా ఆమె వైఎస్ కుటుంబానికి అత్యంత స న్నిహితంగా ఉన్నారు. ఏకంగా వైఎస్ పేరును పచ్చబొట్టుగా వేయించుకున్నారంటే.. ఆమె విశ్వసనీయత ఎలాంటిదో ఇది చాలు! అలాంటి పుష్ప శ్రీవాణికి జగన్ కూడా అంతే ప్రాధాన్యం ఇచ్చారు. ఎస్టీ కోటాలో ఆమెకు డిప్యూటీ సీఎం పదవిని అప్పగించారు. అంతేకాదు గిరిజన సంక్షేమ శాఖను అప్పగించి ఆమెను ఓ రేంజ్‌కు తీసుకువెళ్లారు. ఇలాంటి పదవి వస్తుందని తను కలలో కూడా ఊహించలేదని ఆమె స్వయంగా చెప్పారు.
పుష్ప శ్రీవాణి ఆది నుంచి కూడా జగన్‌కు వీరాభిమానిగా ఉన్నారు. ఆయన పాదయాత్ర చేసిన సమయం లోనూ ఆమె పాదయాత్రలో భాగస్వామ్యం వహించారు. పార్టీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో అసెంబ్లీలో తనదైన శైలిలో మాట్లాడి అప్పటి అధికార పక్షాన్ని టార్గెట్ చేశారు. అలాంటి నాయకురాలికి ఊహించని పదవి ఇచ్చిన జగన్ ఆమెకు తాను ఇస్తున్న ప్రాధాన్యాన్ని చెప్పకనే చెప్పారు. తద్వారా పార్టీలో ఆది నుంచి ఉన్నవారికి తాను ఇచ్చే ప్రాధాన్యాన్ని కూడా వెల్లడించారు. మొత్తంగా ఓ ఎస్టీ నాయకురాలికి డిప్యూటీ సీఎం పదవిని ఇచ్చిన చరిత్రను ఇచ్చిన నాయకుడిగా మంచి రికార్డును జగన్ సొంతం చేసుకోవడం గమనార్హం.