సంచలనం : జగన్ కు షాకిచ్చిన సొంత ఎంఎల్ఏ

Vijaya

మూడు రాజధానుల జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదనలపై  సొంతపార్టీ ఎంఎల్ఏ నుండే మొదటి షాక్ తగిలిందా ?  విశాఖపట్నాన్ని అడ్మినిస్ట్రేటివ్ రాజధానిగా ఎంచుకోవచ్చన్న ప్రతిపాదనను  గోపిరెడ్డి శ్రీనివాసుల రెడ్డి విభేదించారు. మీడియాతో గోపిరెడ్డి మాట్లాడుతూ సచివాలయం అమరావతి ప్రాంతంలోనే ఉండాలని డిమాండ్ చేయటం పార్టీలో సంచలనంగా మారింది.

అసెంబ్లీలో జగన్ మాట్లాడుతూ విశాఖపట్నాన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటిల్ గా చేయచ్చని చెప్పిన విషయం తెలిసిందే.  జగన్ ఏదో ప్రతిపాదన అన్నట్లుగా చెప్పినా తెరవెనుక అంతా రెడీ అయిపోయిందనే అందరూ అనుకుంటున్నారు.  జగన్ అసెంబ్లీలో చేసిన ప్రకటనతో రాష్ట్రంలో ఒక్కసారిగా మంటలు మొదలయ్యాయి. మరీ ముఖ్యంగా రాజదాని అమరావతి ప్రాంతంలో అయితే ఒక సెక్షన్ రైతులు చేస్తున్న ఆందోళన అందరికీ తెలిసిందే.

ఇటువంటి నేపధ్యంలోనే జగన్ ప్రతిపాదనకు భిన్నంగా నరసరావుపేట ఎంఎల్ఏ గోపిరెడ్డి మాట్లాడటంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు.  మామూలుగా జగన్ తీసుకున్న లేదా  ప్రకటించిన నిర్ణయానికి వ్యతిరేకంగా మాట్లాడేంత సాహసం ఎవరూ చేయరు. ఏదన్నా భిన్నాభిప్రాయాలుంటే నేరుగా జగన్ తోనే చెప్పుకుంటారు.  అలాంటిది గోపిరెడ్డి బహిరంగంగానే తన అభిప్రాయాన్ని చెప్పటం విచిత్రంగానే ఉంది.

గోపిరెడ్డి తాజా ప్రకటనకు కారణం ఏమిటంటే స్ధానికుల నుండి వస్తున్న ఒత్తిడే అని సమాచారం. సచివాలయాన్ని అమరావతి నుండి తరలించటాన్ని వ్యతిరేకిస్తు రైతులు, టిడిపి పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. స్ధానికులు, రైతులు, ఉద్యోగులు  గోపిరెడ్డి మీద బాగా ఒత్తిడి పెడుతున్నట్లు సమాచారం. స్ధానికుల నుండి ఎదురవుతున్న ఒత్తిడిని తట్టుకోలేకే గోపిరెడ్డి బాహాటంగా డిమాండ్ చేసినట్లున్నారు.

జగన్ ప్రతిపాదనకు భిన్నంగా గోపిరెడ్డి నోరు విప్పారు కాబట్టి రాజధాని నియోజకవర్గాలైన మంగళగిరి, తాడికొండతో పాటు గుంటూరు జిల్లాలోని మిగిలిన  నియోజకవర్గాల ఎంఎల్ఏలు కూడా గొంతు కలుపుతారేమో చూడాలి.  నిజంగా వైసిపి ఎంఎల్ఏలు కూడా గోపిరెడ్డితో కలిస్తే జగన్ ప్రతిపాదన ఆచరణకు రావటం అంత ఈజీ కాదన్న విషయం తెలిసిపోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: