చికెన్ అంటే చిక్కులే... కొండెక్కిన చికెన్ ధర...!
చికెన్ ధరలకు రెక్కలొచ్చాయి. సామాన్యునికి అందనంతగా చికెన్ రేటు పెరుగుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు పెరిగాయి. హైదరాబాద్ నగరంలో కిలో చికెన్ ఏకంగా 220 రూపాయలు పలుకుతోంది. మిగతా ఏరియాలలో 220 రూపాయల కంటే ఎక్కువగా పలుకుతోండటంతో చికెన్ ప్రియులు నిరుత్సాహపడుతున్నారు. పౌల్ట్రీ సంఘాలు చికెన్ ధరలు పెరగటానికి కోళ్ల దాణా కూడా ఒక కారణమని చెబుతున్నారు.
చికెన్ కొనుగోళ్లు పెరగటంతో చికెన్ ధరలు అమాంతం పెరిగాయి. మాంసం పదార్థాల్లో ప్రజలు ఎక్కువగా వినియోగించేది చికెన్ మాత్రమే. సాధారణంగా వేసవి కాలంలో ఎండ తీవ్రతకు కోళ్లు చనిపోవటంతో ధరలు పెరుగుతాయి. కానీ శీతాకాలం సమయంలో కూడా చికెన్ ధరలు పెరుగుతూ ఉండటం గమనార్హం. వ్యాపార వర్గాల్లో లేయర్ కోళ్ల కంటే బాయిలర్ కోళ్లకు డిమాండ్ పెరిగింది.
కార్తీక మాసానికి ముందు కోళ్ల ఉత్పత్తి తగ్గింది. అప్పటికే ఉత్పత్తి అయిన కోళ్లు సరిగ్గా విక్రయానికి నోచుకోకపోవటంతో వ్యాపారులు కూడా కోళ్ల ఉత్పత్తిని తగ్గించారు. కోళ్ల ఉత్పత్తి తగ్గటంతో చికెన్ కు అనూహ్యంగా డిమాండ్ పెరిగింది. సాధారణంగా ఒక కోడిపిల్ల కోతకు తయారుకావాలంటే నెల రోజుల సమయం పడుతుంది. కోళ్ల ఉత్పత్తి తగ్గటంతో చికెన్ ధరలు దారుణంగా పెంచి అమ్ముతున్నారని చికెన్ ప్రియులు చెబుతున్నారు. చికెన్ ను ఇష్టంగా తినేవారు పెరుగుతున్న ధరలను చూసి ఖంగుతింటున్నారు. రేట్లు పెరగటంతో గతంలో కిలో చికెన్ కొనుగోలు చేసేవారు ఇప్పుడు అర కిలో, పావు కిలోతో సరిపెట్టుకుంటున్నారు.
హోల్ సేల్ మార్కెట్లతో పాటు రిటైల్ మార్కెట్లలో ధరలు అమాంతం పెరిగాయి. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో మటన్ ధరలు కూడా పెరుగుతూ ఉండటంతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. డిమాండ్ కు అనుగుణంగా దిగుమతి లేకపోవటంతో మటన్ ధరలు అమాంతం పెరుగుతున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. సంక్రాంతి పండుగ వరకు ధరలు తగ్గే అవకాశం లేదని తెలుస్తోంది.