ఏపీ రాజకీయాల్లో మత చిచ్చు..!
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మత ప్రస్తావన పెరుగుతోంది. రాష్ట్రంలో క్రైస్తవం పెరుగుతోందంటూ ఇప్పటికే బీజేపీ రచ్చ చేస్తుండగా....ఇప్పుడు టీడీపీ కూడా అదే స్వరం తీసుకుంది. తిరుమల శ్రీవారి దర్శనంపై సీఎం డిక్లరేషన్ ఇవ్వాలనే డిమాండ్ తో వేడి మరింత రాజుకుంది. మరోవైపు ప్రతిపక్షాలు మత రాజకీయాలు చేస్తున్నాయని వైసీపీ కస్సుమంటోంది.
రాష్ట్రంలో మత మార్పిడులు, అన్యమత ప్రచారంపై ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కొద్ది నెలలుగా రాష్ట్రంలో పరిణామాలపై రాజకీయ పార్టీలు అందోళన వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యంగా హిందూ మతం స్థానంలో క్రైస్తవాన్ని చొప్పించే ప్రయత్నం జరుగుతోందంటూ విమర్శలకు దిగుతున్నాయి. ప్రభుత్వ ప్రమేయం లేకుండా కొన్ని జిల్లాలలో జరిగిన ఘటనలకు సర్కారు బాధ్యత వహించాలంటున్నాయి.
సీఎం జగన్ విషయంలో ప్రధాన ప్రతిపక్షం ఇప్పటి వరకు ఆచితూచి వ్యవహరించింది. అయితే ఇసుక దీక్ష రోజు చంద్రబాబు చేసిన వ్యాఖ్యలతో దాన్నీ చర్చలోకి తీసుకువచ్చారు. ముఖ్యమంత్రి క్రైస్తవుడు కాబట్టి... శ్రీవారి దర్శనానికి వెళ్లినప్పుడు డిక్ల రేషన్ ఇవ్వాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. ఇతర పక్షాలు కూడా ఇదే డిమాండ్ లేవనెత్తాయి. గతంలో సొనియా గాంధీ, అబ్దుల్ కలాం లాంటి వారు కూడా డిక్లరేషన్ ఇచ్చి దర్శనానికి వెళ్లినప్పుడు జగన్ ఇస్తే తప్పేంటన్నది వారి మాట.
ప్రస్తుతం జగన్ తిరుమల పర్యటన వంటివి ఏవీ లేకున్నా.... ప్రతిపక్షాలు ఇప్పుడు ఆ అంశాన్ని ప్రస్తావించడాన్ని అధికార పార్టీ తప్పు పడుతోంది. తిరుమల గుడి మీరు కట్టించారా? అంటూ మంత్రి కొడాలి నాని చేసిన ప్రకటనను కూడా ప్రతిపక్షాలు తీవ్రంగా తప్పుపడుతున్నాయి. మొత్తంగా చూసుకుంటే ఎపి రాజకీయాల్లో మతం అంశం పెద్ద చర్చకే దారి తీసేట్టు కనిపిస్తోంది. ప్రతిపక్ష నాయకుడు లేవనెత్తిన ఈ అంశంపై ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఏ విధంగా స్పందిస్తారో చూడాలి. ఇప్పటికే అధికార పార్టీ నేతలు తమవాదనను వినిపించేస్తున్నారు.