హైదరాబాద్: టీడీపీ అధినేత చంద్రబాబు కుమారుడు నారా లోకేష్ రాజకీయ రంగ ప్రవేశం లేదనీ టీడీపీ అంటోంది. గత రెండుమూడు రోజులుగా బాబు కుమారుడు లోకేష్ రాజకీయ రంగ ప్రవేశం చేయనున్నట్లు మీడియాలో జోరుగా వార్తలొచ్చాయి. వచ్చే నెల నుంచి చంద్రబాబు ప్రజలతో మరింత మమేకం అయ్యేందుకు పాదయాత్రను చేయనున్నారు. బాబు ప్రజల్లో ఉంటే,పార్టీ కార్యకలాపాలు చూసుకోవడానికి గానూ లోకేష్‌ను రాజకీయాల్లోకి తెస్తున్నారనీ, లోకేష్‌కు పార్టీ ప్రధాన కార్యదర్శి పదవీని కట్టబెడుతున్నారనీ, లోకేష్ కోసం ఎన్టీఆర్ ట్రస్టు భవన్ మొదటి అంతస్థులో ప్రత్యేకంగా ఓ ఛాంబర్‌ను కూడా తయారు చేస్తున్నట్లు మీడియా కోడై కూసింది.
అయితే, ఇవన్నీ ఊహాగానాలేననీ, లోకేష్ రాజకీయాల్లోకి రావడం లేదనీ, పార్టీ నేత వర్ల రామయ్య తెలిపారు. లోకేష్ రాజకీయాల్లోకి రావడం లేదంటున్న టీడీపీ...త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విలీనం కావడం తథ్యమనీ సెలవిచ్చారు. ఇదిలా ఉంటే, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు తెలంగాణ రాజకీయ ఛైర్మన్ కోదండరామిరెడ్డి మధ్యన విబేధాలు తలెత్తాయనీ, ఇద్దరి మధ్య మాటా, ముచ్చట్లు బందయ్యాయనీ కూడా మీడియాలో వార్తలొచ్చాయి. అయితే, తమ మధ్యన ఎలాంటి విబేధాల్లేవనీ తెలంగాణ రాజకీయ ఛైర్మన్ కోదండరామిరెడ్డి చెప్పారు. విబేధాలన్నీ వట్టి మాటన్నారు. ఊహాగానాలు నమ్మొద్దన్నారు. తెలంగాణ కోసం కేసీఆర్ దేశ రాజధాని ఢిల్లీలో కొట్లాడుతుంటే, తామందరమూ తెలంగాణ గల్లీలో కొట్లాడుతున్నామనీ అన్నారు. కేసీఆర్, తమ మధ్య ఎలాంటి మనస్పర్ధలు, విబేధాలు లేవన్నారు.
తమ మధ్యన సీమాంధ్ర నేతలు చిచ్చుపెట్టాలనీ చూస్తున్నారనీ, వారి ఆటలు సాగనివ్వబోమనీ కోదండరామిరెడ్డి చెప్పుకొచ్చారు. కొన్ని రోజులుగా లోకేష్ రాజకీయాల్లోకి వస్తున్నారంటూ మీడియాలో వస్తున్న వార్తలకు వర్ల రామయ్య తెరదించగా...కేసీఆర్, కోదండరామిరెడ్డి మధ్యన వచ్చిన విబేధాలకు కోదండరామిరెడ్డి తెరదించారు. ఈ రెండు ఒకే రోజున జరగడం గమనార్హం.
మరింత సమాచారం తెలుసుకోండి: