ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అభివృద్ధి దిశగా వడివడిగా అడుగులు వేస్తోంది. సీఎం జగన్ మరో కీలక పథకం ప్రారంభించేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఏపీ ప్రభుత్వ ఖజానా పెంచుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ఆ పథకం ఏంటో కాదు బిల్డ్ ఏపీ మిషన్. దీనిపై ముఖ్యమంత్రి ఆసక్తి కనబరుస్తున్నారు. విజయవాడలో విజయవాడలో బిల్డ్ ఏపీ మిషన్ తొలి ప్రాజెక్ట్ చేపట్టాలని నిర్ణయించుకొని.. ఆ దిశగా పయనిస్తున్నారు. పథకం అమల్లో భాగంగా నిధుల సమీకరణ కోసం రెండెకరాల భూమిని విక్రయించేందుకు సన్నాహాలు చేస్తోంది ఏపీ ప్రభుత్వం.
బిల్డ్ ఏపీ మిషన్ పథకం అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. ఇందులో భాగంగా నిధుల సమీకరణ కోసం నిరుపయోగంగా ఉన్న రెండెకరాల భూమిని విక్రయించే దిశగా చర్యలు చేపట్టింది. స్టేట్ గెస్ట్ హౌస్ ప్రాంగణంలోని ఖాళీ స్థలాన్ని.. బూత్ బంగ్లాను తలపిస్తోన్న భవనాలను విక్రయించే అవకాశం ఉంది. అధునాతన భవనాల కోసం.. కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మాణానికి ఇది అనువైన ప్రదేశమని అధికారులు అంటున్నారు. ఈ స్థలం అమ్మకం ద్వారా ప్రభుత్వానికి రూ. 200 కోట్లు ఆదాయం సమకూరుతుందని అంచనా.
స్టేట్ గెస్ట్ హౌస్ ప్రాంగణంలోని స్థలం మాల్స్, మల్టీప్లెక్సుల నిర్మాణానికి అనువైందంటున్నారు అధికారులు. ఈ తరహా ప్రాజెక్టులు వస్తే అభివృద్ధితోపాటు.. ఉపాధి కల్పన కూడా సాధ్యమవుతుందని అంటున్నారు అధికారులు. బిల్డ్ ఏపీ మిషన్ విజయవాడ నగరానికి తలమానికంగా ఉంటుందని భావిస్తున్నారు. మరోవైపు ప్రభుత్వ ప్రతిపాదనని తప్పుపట్టారు యనమల రామకృష్ణుడు. త్వరలో ప్రభుత్వ కార్యాలయాలు అమ్మకం అనే ప్రకటన కూడా చూడాల్సి వస్తుందేమోనని ఎద్దేవా చేశారు. ప్రభుత్వ భూములను వైసీపీ నేతలకు చవకగా అమ్ముకుంటున్నారని విమర్శించారు యనమల. టీడీపీ నేతల విమర్శలను తిప్పికొట్టేందుకు వైసీపీ నేతలు సిద్ధమవుతున్నారు.