చంద్రబాబుకే చుక్కలు చూపుతున్న ఎంఎల్ఏలు

Vijaya

తెలుగుదేశంపార్టీ ఎంఎల్ఏల్లో కొందరు చంద్రబాబునాయుడుకే చుక్కలు చూపుతున్నారు. గన్నవరం ఎంఎల్ఏ వల్లభనేని  వంశీ  రాజీనామా వ్యవహారంతో చంద్రబాబులో టెన్షన్ పీక్స్ కు చేరుకున్న విషయం అందరికీ అర్ధమైపోతోంది. ఈ నేపధ్యంలోనే ప్రకాశం జిల్లా ఎంఎల్ఏలతో ఫోన్లో చంద్రబాబు మాట్లాడటం సర్వత్రా ఉత్కంఠకు తెరలేపింది.

 

జిల్లాలో నాలుగు నియోజకవర్గాల్లో టిడిపి అభ్యర్ధులు గెలిచారు. చీరాలలో కరణం బలరాం, కొండెపిలో బాలస్వామి, అద్దంకిలో గొట్టిపాటి రవికుమార్, పర్చూరులో ఏలూరి సాంబశివరావు గెలిచిన దగ్గర నుండి పార్టీ కార్యక్రమాల్లో పెద్దగా పాల్గొనటం లేదు. ఇసుక వ్యవహారంపై  చంద్రబాబు పిలుపుమేరకు రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో ఆందోళనలు జరిగాయి.

 

అయితే ప్రకాశం జిల్లాలో జరిగిన నిరసన కార్యక్రమాల్లో నలుగురు ఎంఎల్ఏలూ పాల్గొనలేదు. అంటే చంద్రబాబు ఆదేశాలను ఏ ఒక్క ఎంఎల్ఏ కూడా లెక్క చేయలేదు. అదే సమయంలో కరణం బలరామ్ బిజెపి రాజ్యసభ ఎంపి సుజనా చౌదరితో భేటి జరిపారు. కరణంబలరాం ను బిజెపిలో చేరమని సుజనా ఎప్పటి నుండో అడుగుతున్నారట. దాంతో వీరిద్దరి భేటి పార్టీలో కలకలం రేపింది. అంతకుముందు వైసిపి ఎంపి మాగుంట శ్రీనివాసులరెడ్డి జన్మదిన వేడుకల్లో కూడా కరణం పాల్గొన్నారు.

 

ఈ విషయాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు గొట్టిపాటి మినహా మిగిలిన  ఎంఎల్ఏలతో విడివిడిగా చాలాసేపు ఫోన్లో మాట్లడారు. గొట్టిపాటి ఫోన్లో దొరకకపోవటంతో చంద్రబాబులో మరింత టెన్షన్ పెరిగిపోయింది. అయితే సోమవారం రాత్రి చంద్రబాబును గొట్టిపాటి విజయవాడలో నేరుగా కలిశారు. వాళ్ళిద్దరి మధ్య జరిగిన చర్చల సారాంసం అయితే బయటకు పొక్కలేదు.

 

వంశీ రాజీనామా ఎపిసోడ్ తో పార్టీలో ఉండేదెవరో ? వెళ్ళిపోయేదెవరో అర్ధంకాక చంద్రబాబులో బిపి పెరిగిపోతోంది. అందుకనే అందరు ఎంఎల్ఏలతోను రెగ్యులర్ గా మాట్లాడుతూ ఆరాలు తీస్తున్నారు. అయినా వెళ్ళిపోదలచుకున్న ఎంఎల్ఏలైనా నేతలైనా చంద్రబాబు ఫోన్లో మాట్లాడితే ఉంటారా ? పార్టీమీద, చంద్రబాబు నాయకత్వం మీద నమ్మకం లేకే కదా కొందరు వెళ్ళిపోయింది.

 

 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: