టిక్‌టాక్‌లో అధికారిక ఖాతా తెరిచిన పార్టీ

NAGARJUNA NAKKA
ఫేస్‌బుక్‌, వాట్సాప్‌లను మించి ఈ మధ్య యూత్‌ను తెగ ఊపేస్తున్న యాప్‌ టిక్‌టాక్‌. చిన్నా పెద్దా తేడా లేకుండా అంతా టిక్‌టాక్‌తో పండగ చేసుకుంటున్నారు. కొంతమంది పొద్దస్తమానం అందులోని వీడియోల్ని చూస్తూ  టైం పాస్‌ చేస్తుంటే.. మరికొందరు తమ టాలెంట్‌ను బయటపెడుతున్నారు. అయితే.. జనాలను ఇంతలా అట్రాక్‌ చేస్తున్న ఈ యాప్‌పై రాజకీయ పార్టీలు కూడా ఫోకస్‌ చేశాయి. క్రియేటివ్‌ వీడియోలతో జనాన్ని తమ వైపు ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఎమ్.ఐ.ఎమ్ పార్టీ టిక్‌టాక్‌లో అఫీషియల్‌గా అకౌంట్‌ ఓపెన్‌ చేసింది. టిక్‌టాక్‌లో అధికారిక ఖాతా తెరిచిన తొలి రాజకీయ పార్టీగా ఎమ్.ఐ.ఎమ్ రికార్డులకెక్కింది. 


సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతున్న కొద్దీ సామాజిక మాధ్యమాలు విస్తృతం అవుతున్నాయి. టీవీ స్థానంలో అరచేతిలో ఫోన్‌ ప్రపంచాన్ని చూపిస్తోంది. ధనిక, పేద, చిన్నా-పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరు స్మార్ట్‌ ఫోన్లను ఉపయోగిస్తున్నారు. దీంతో సామాజిక మాధ్యమాల విస్తృతీ పెరుగుతోంది. ఎక్కువ మందిని చేరుకునేందుకు ఇప్పుడు ఇవే మార్గాలవుతున్నాయి. అందుకే రాజకీయ పార్టీలు కూడా సోషల్‌ మీడియా నిర్వహణ  కోసం ప్రత్యేక వ్యూహాలు రూపొందించుకుంటున్నాయి. హైదరాబాద్‌ పాతబస్తీ పునాదులపై ఏర్పడిన మజ్లిస్‌ పార్టీ కూడా మిగిలిన పార్టీలతో పోటీ పడుతూ... సోషల్‌ మీడియాను విస్తృతంగా ఉపయోగించాలని భావిస్తోంది. పాత సంప్రదాయ తీరుకు భిన్నంగా ట్విట్టర్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాల్లో పార్టీ కార్యక్రమాలు, నేతల ప్రసంగాలు, వ్యాఖ్యానాలు పోస్ట్‌ చేస్తున్నారు. కార్యకర్తలు, అభిమానుల నుంచి మంచి స్పందన వస్తుండడంతో మజ్లిస్‌ పార్టీ మరో అడుగు ముందుకు వేసింది. సరదా వీడియోలు రూపొందించి అప్‌లోడ్‌ చేసే టిక్‌ టాక్‌ను తనకు వేదికగా మలుచుకుంది. 


ఈ మధ్య కాలంలో మిగిలిన అన్ని సోషల్‌ మీడియా వేదికల కంటే టిక్‌ టాక్‌ వేగంగా దూసుకుపోతోంది. కామెడీ, సెటైర్‌ కలిపి రూపొందించే ఈ వీడియోలకు ఈ మధ్య కాలంలో ప్రాచుర్యం ఎక్కువగా లభిస్తోంది. కొన్ని వీడియోల్లో అసభ్యత పాళ్లు ఎక్కువ అవుతున్న కారణంతో టిక్‌ టాక్‌ను నిలిపేయాలన్నా ప్రయత్నమూ జరిగింది. టిక్‌ టాక్‌ సెల్ఫీ వీడియోలు తీస్తూ కొంత మంది మృత్యువాత పడిన సంఘటనలూ, ఆత్మహత్యలు చేసుకున్న సందర్భాలు లేకపోలేదు. ఏదైనా న్యూస్‌ త్వరగా జనాల్లోకి చేరాలంటే చాలామంది సోషల్‌మీడియానే ఎంచుకుంటున్నారు. అందుకే ఎమ్‌ఐఎమ్‌ పార్టీ పెద్దలు ఈ మధ్యమాన్ని తమకు అనుకూలంగా మలుచుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. అధికారికంగా ఖాతాను కూడా తెరిచారు. ప్రస్తుతం ఏడువేలకు పైగా ఫాలోవర్లు ఎమ్‌ఐఎమ్‌ టిక్‌టాక్‌లో ఉన్నారు. 


పార్టీలు చేసే రాజకీయ వ్యూహాల్లో సోషల్‌మీడియా నిర్వహణ కూడా ఒక భాగంగా మారిందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. కేవలం స్థానికులే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా తమ ఆలోచనలను ప్రచారం చేరేందుకు ఉపయోగపడుతుందని అంటున్నారు.
ఓ వైపు ఇతర రాష్ట్రాల్లో ఎన్నికల బరిలో నిలబడటం, ఇక్కడ తెలంగాణాలో ప్రతిపక్ష హోదా పొందటంతో ఎమ్‌.ఐ.ఎమ్‌ పరిధి పాతబస్తీ దాటి బయటకు వచ్చినట్లు అవుతోంది. మొత్తంగా సోషల్‌ మీడియా ద్వారా మరింత మందికి చేరే వ్యూహాలపై మజ్లిస్‌ బ్రదర్స్‌ కసరత్తు ముమ్మరం చేశారు. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: