తెలంగాణలో గత కొద్ది రోజులుగా అందరూ ఎంతో ఆసక్తితో వెయిట్ చేస్తున్న నల్లగొండ (పాత) జిల్లా హుజూర్‌నగర్ ఉప ఎన్నికకు కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థిని ప్రకటించింది. కొద్దిరోజులుగా ఈ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున ఎవరు పోటీ చేస్తారా ? అన్న ఆసక్తి నెలకొంది. తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గత డిసెంబర్లో జరిగిన సాధారణ ఎన్నికల్లో ఈ స్థానం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఆ ఎన్నికల్లో మొత్తం టీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన ఎన్నారై శానంపూడి సైదిరెడ్డి ఏడు వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.
అయితే ఏప్రిల్ లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి నల్లగొండ నుంచి ఎంపీగా విజయం సాధించారు. దీంతో ఆయన హుజూర్‌నగర్ స్థానాన్ని వదులుకున్నారు. ఈ స్థానానికి ఆరు నెలల్లోగా ఉపఎన్నిక జరగాల్సి ఉంది. అక్టోబర్, నవంబర్లో హుజూర్‌నగర్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలు జరగనున్నట్లు తెలుస్తోంది. ఇక్కడ ప్రధాన పార్టీల నుంచి ఎవరు పోటీ చేస్తారన్నది కొద్దిరోజులుగా ఆసక్తి నెలకొంది. తాజాగా హుజూర్‌నగర్ ఉప ఎన్నిక కాంగ్రెస్ అభ్యర్థిగా పద్మావతి పేరును పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రకటించారు. చింతలపాలెం మండలం నక్కగూడెం పర్యటనలో ఉత్తమ్ వెల్లడించారు.
ఇక ఉత్తమ్‌కుమార్ రెడ్డి భార్య పద్మావతి 2014లో ఉత్తమ్‌తో పాటు కోదాడ నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు. ఆ ఎన్నికల్లో పద్మావతి టిడిపి నుంచి పోటీ చేసిన బొల్లం మల్లయ్య యాదవ్ పై ఘన విజయం సాధించి తొలిసారిగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఇక గత డిసెంబర్ లో జరిగిన ఎన్నికల్లో అదే మల్లయ్య యాదవ్ చేతిలో ఓడిపోయారు. 2014 ఎన్నికల్లో మల్లయ్య యాదవ్ టిడిపి నుంచి పోటీ చేయగా... తాజా ఎన్నికల్లో ఆయన టిఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి పద్మావతి పై విజయం సాధించారు.
కోదాడలో గత అసెంబ్లీ ఎన్నికల్లో పద్మావతి ఓటమి చెందారు. ఇక హుజూర్ నగర్ ఉప ఎన్నిక కోసం కాంగ్రెస్ నుంచి సూర్యాపేటకు చెందిన పటేల్ రమేష్ రెడ్డి పేరు తో పాటు... ఉ జానా రెడ్డి కుమారుడు రఘువీర్ రెడ్డి పేర్లు కూడా వినిపించాయి. అయితే ఉత్తమ్ కుమార్ రెడ్డి సొంత నియోజకవర్గం కావడంతో ఆయన ఇతరులకంటే తన భార్య పద్మావతి రంగంలో ఉంటేనే భవిష్యత్తులో కూడా ఇక్కడ ఇతరుల నుంచి తనకు ఇబ్బంది ఉండదని భావించి... ఆమె పోటీ చేయించాలని డిసైడ్ అయినట్టు తెలుస్తోంది.