చంద్రబాబు గడ్డి కరిచారా ?
కరకట్ట మీద నిర్మించిన
అక్రమ నిర్మాణం లింగమనేని గెస్ట్ హౌస్ ను సొంతం చేసుకోవటానికి చంద్రబాబునాయుడు
గడ్డి కరిచారా ? అవుననే అంటున్నారు వైసిపి ఎంఎల్ఏ అంబటి రాంబాబు. మీడియాతో
మాట్లాడుతూ లింగమనేని గెస్ట్ హౌస్ ను సొంతం చేసుకోవటానికి చంద్రబాబు
గడ్డితిన్నారంటూ మండిపడ్డారు.
2014లో చంద్రబాబు అధికారంలోకి రాగానే ఇరిగేషన్ శాఖ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు ప్రత్యేకంగా కరకట్ట మీద నిర్మించిన 25 నిర్మాణాలు అక్రమ నిర్మాణాలే అంటూ ఇరిగేషన్ శాఖ నోటిసులిచ్చిన విషయాన్ని అంబటి గుర్తుచేశారు. అక్రమనిర్మాణాలను కూల్చేయటంలో భాగంగా 25 నిర్మాణాలకు నోటిసులిచ్చిన విషయం తెలిసిందే.
అలా నోటీసులు అందుకున్న భవనాల్లో లింగమనేని గెస్ట్ హౌస్ కూడా ఒకటి. అలాంటిది తెరవెనుక ఏమి జరిగిందో తెలీదు కానీ తర్వాత జరిగిన పరిణామాల్లో స్వయంగా చంద్రబాబే లింగమనేని గెస్ట్ హౌస్ లో నివాసముండటాన్ని అంబటి తప్పుపట్టారు. కూల్చేయాల్సిన అక్రమనిర్మాణాల్లోని ఒకదానిని చంద్రబాబు అధికార నివాసంగా మార్చుకున్నారంటే చంద్రబాబు గడ్డి కరిచారనటంలో ఎటువంటి సందేహం లేదన్నారు.
అక్రమనిర్మాణాన్ని కూల్చేయకపోగా ఇంకా అందులోనే ఉంటూ బురద రాజకీయాలు చేయటమేంటంటూ మండిపోయారు. కృష్ణానదికి వరద వచ్చినపుడు కరకట్ట మీద ఉన్న అక్రమనిర్మాణాలు ముణిగిపోతాయని ప్రభుత్వం చెబుతున్నా ఇంకా అక్కడి నుండి ఎందుకు కదలటం లేదని చంద్రబాబును ఎంఎల్ఏ ప్రశ్నించారు. వరద బాధితులను ఆదుకోవాల్సిన బాధ్యత ఉన్న ప్రతిపక్ష నేత బురద రాజకీయాలు చేయటమేంటని నిలదీశారు.
లింగమనేని గెస్ట్ హౌస్ ప్రైవేటు భవనమా ? లేకపోతే ప్రభుత్వ భవనమా ? అన్న విషయంలో కూడా చంద్రబాబు నేరుగా సమాధానం చెప్పలేకపోవటాన్ని అంబటి గుర్తుచేశారు. తెరవెనుక లింగమనేనితో చేసుకున్న ఒప్పందం కారణంగానే అక్రమ నిర్మాణంపై చంద్రబాబు నోరు మెదపటం లేదని అభిప్రాయపడ్డారు. మొత్తం మీద చంద్రబాబు పుణ్యమా అని అక్రమనిర్మాణం బాగా పాపులర్ అయిపోయింది. జనాలంతా అక్రమనిర్మాణంలో ఉండటం తప్పని చెబుతున్నా చంద్రబాబు మాత్రం అక్కడి నుండి కదలకపోవటం గమనార్హం.