క‌మ‌లంలో క‌ల‌హాలు మొద‌ల‌య్యాయ్‌

VUYYURU SUBHASH
ఇందూరు క‌మ‌లంలో క‌ల‌హాలు మొద‌ల‌య్యాయి. జిల్లాలో  మాజీ ఎమ్మెల్యేకు తాజా ఎంపీకి మధ్య కోల్డ్‌వార్ న‌డుస్తోంది. ఈ ఇద్ద‌రి నేత‌ల మ‌ధ్య ప్ర‌స్తుతం పచ్చి గడ్డి వేస్తే భగ్గుమంటోంది. మున్సిపల్ ఎన్నికలకు స‌మ‌యం ద‌గ్గ‌ర ప డుంతుండ‌టంతో ఈ వివాదం మరింత ముదురుతోంది. టికెట్ల కోసం నేతల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోందనే టాక్ వినిపిస్తోంది. పార్టీలో పట్టు కోసం కొత్త నేత ప్రయత్నిస్తుంటే ... తన క్యాడర్‌ను కాపాడుకునేందుకు పాత నేత, అంతే దూకుడుగా వ్యవహరిస్తున్నారు. 


ఇలా నిజామాబాద్ జిల్లాలో రెండు గ్రూపుల మధ్య కార్యకర్తలు నలిగిపోతున్నారు. తెలంగాణలో బీజేపీకి పట్టున్న నియోజకవర్గాల్లో నిజామాబాద్ అర్బన్ ఒకటి. ఇక్కడ ఆ పార్టీకి చెప్పుకోద‌గ్గ ఓటు బ్యాంక్ ఉంది. గతంలో ఈ నియోజకవర్గం నుంచి రెండుసార్లు బీజేపీ అభ్యర్ధి ఎమ్మెల్యేగా విజయం సాధించగా ఇప్పుడు ని జామాబాద్ పార్లమెంట్ లోనూ కమలం వికసించింది. పార్టీ కోర్ కమిటీ సభ్యుడిగా ఉన్న యెండల లక్ష్మీనారాయణ పీ సీసీ అధ్యక్షుని హోదాలో ఉన్న డీ శ్రీనివాస్‌ను ఓడించి అప్ప‌ట్లో సంచ‌ల‌నం సృష్టించారు. అనంతరం మరోసారి ఎమ్మెల్యేగా విజ‌యంసాధించారు. 


ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఆ పార్టీ ఓడిపోయినా, గౌరవప్రదమైన ఓట్లతో పరువు కాపాడుకుంది. అయితే  నేతల మ‌ధ్య  గ్రూపులు, వర్గాలు పక్కన పెట్టి సమన్వయంతో పనిచేస్తే ఇక్క‌డ విజయం న‌ల్లేరు మీద న‌డ‌కే అన్న ధీమాలో ఉన్నారు ఆ పార్టీ పెద్దలు. కాగా అధిష్టానం ఒకటి తలిస్తే ఇక్కడ మరోలా జరగడం క్యాడర్‌లో గుబులు రేపుతోంది. బీజేపీ సీనియర్ నేత, కోర్ కమిటీ సభ్యుడు ఎండల లక్ష్మినారాయణ పార్టీలో సీనియర్ నాయకుడు. అర్బన్‌లో ఆయన క్యాడర్ బలంగా ఉంది. ప్రస్తుతం పార్టీలో ఎండల వర్గం హ‌ల్ చ‌ల్ చేస్తోంది. కాగా రెండేళ్ల క్రితం పార్టీలో చేరి ఎంపీగా ఎన్నికైన ధర్మపురి అర‌వింద్‌.. సీనియర్లను పక్కన పెట్టి సొంత కుంపటి పెట్టుకున్నారనే ప్రచారం సాగుతోంది. 


జిల్లాపై పట్టు సాధించి తన వర్గం ఏర్పాటు చేసుకునే దిశలో ఆయ‌న పావులు కదుపుతూన్నారనే టాక్ నడుస్తోంది. తన పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో తన మాటే శాసనం కావాలని శాసిస్తున్నారని, పార్టీలోనే కొందరు నేతలు చర్చించుకుంటున్నారు. ఐతే అర‌వింద్ దూకుడుకు ఎండల లక్ష్మినారాయణ వర్గం, బ్రేకులు వేసేందుకు సమయం దొరికినప్పుడల్లా ప్రయత్నిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో పార్టీ క్యాడర్ సైతం రెండు వర్గాలుగా చీలిపోయింది. ఇలా ఇద్దరు నేతలు ఎవరికి వారే అన్నట్లుగా వ్యవహరిస్తున్నట్లు అధిష్ఠానం దృష్టికి వెళ్లింది. సీనియర్ లీడర్లకు కనీస మర్యాద ఇవ్వరని అర‌వింద్‌పై ఎండల వర్గం ఆగ్రహంగా ఉంది. అటు ఎండల వర్గంపై అర‌వింద్ వర్గం అంతే గుస్సా ప్రదర్శిస్తోంది. 


పార్లమెంట్ ఎన్నికల్లో ఎండల వర్గం తమకు సపోర్ట్ చేయలేదని నేతలిద్దరూ కాలు దు వ్వుకుంటున్నారు. దీంతో ఇందూరు కాషాయ పార్టీలో వర్గ పోరు మరింత ముదురుతోంది. మ‌రోప‌క్క అర్బన్‌లో గతంలో ఎమ్మెల్యేగా పోటి చేసి, మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ త్యాగం చేసిన మరో నేత ధన్‌పాల్ సూర్యనారాయణ సైతం తన క్యాడర్‌కు కార్పొరేషన్‌లో టికెట్లు ఇప్పించుకునేందుకు గట్టి ప్రయత్నం చేస్తున్నారు. పార్టీ బలంగా ఉన్నా రోజురోజుకు బలపడుతుందనే ప్రచారం జరుగుతున్నా నేతల మధ్య ఆధిపత్య పోరుతో పార్టీ డీలా పడుతోందని కమలం శ్రేణులు కలవరపడుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: