ఎడిటోరియల్ : అసలు భవనం యజమాని లింగమనేనేనా ? టిడిపినే ఎందుకు మాట్లాడుతోంది ?
కరకట్ట మీద
చంద్రబాబునాయుడు అద్దెకు ఉంటున్న భవనం యజమాని లింగమనేని రమేష్ ఎక్కడున్నట్లు ? తన
భవనంపై రాష్ట్రవ్యాప్తంగా ఇంత యాగీ జరుగుతున్నా లింగమనేని మాత్రం మీడియా ముందుకు
రాలేదు. తన భవనం అనుమతులకు సంబంధించి కనసం ఓ ప్రకటన కూడా జారీ చేయలేదు.
ఇన్ని రోజులు కరకట్ట మీదున్న నిర్మాణాలు అక్రమ కట్టడాలే అని అనుంకుంటున్నారు. ఎందుకంటే 2014లో అధికారంలోకి వచ్చిన కొత్తల్లో కరకట్టమీదున్న కొన్ని భవనాలకు అక్రమనిర్మాణాలంటూ అప్పటి టిడిపి ప్రభుత్వం కూడా నోటీసులు ఇచ్చింది. దాంతో ఏది అక్రమమో ఏది సక్రమమో తెలీదు కాబట్టి జనాలు కూడా అన్నీ అక్రమనిర్మాణాలనే అనుకుంటున్నారు.
అక్రమనిర్మాణం పేరుతో జగన్మోహన్ రెడ్డి ప్రజావేదికను కూల్చేయటంతో మళ్ళీ గొడవ రాజుకుంది. అదే సమయంలో అక్రమనిర్మాణమనుకుంటున్న లింగమనేని గెస్ట్ హౌస్ లోనే చంద్రబాబు నివాసముండటంతో టిడిపి నానా యాగీ చేస్తోంది. లింగమనేని గెస్ట్ హౌస్ అక్రమ నిర్మాణం కాదని అన్నీ అనుమతులు తీసుకునే నిర్మించినట్లు టిడిపి చెబుతోంది.
నిజానికి భవనం యజమాని లింగమనేనే అయితే తన భవనం అక్రమనిర్మాణం కాదని చెప్పాల్సింది లింగమనేనే కానీ టిడిపి నేతలు కాదు. ఎందుకంటే ప్రభుత్వం నోటీసులిచ్చింది లింగమనేనికే కానీ చంద్రబాబుకో లేకపోతే టిడిపికో కాదు. నోటీసులకు సమాధానం చెప్పాల్సిన లింగమనేని ఏమో ఎవరికీ కనిపించటం లేదు. నోటీసులతో ఏమాత్రం సంబంధం లేని టిడిపి నేతలు రెచ్చిపోతున్నారు.
ఇక్కడే అందరికీ అనుమానాలు వస్తున్నాయి. నిజంగా భవనం యజమాని లింగమనేనే అయితే నోటీసులకు సమాధానం చెప్పటానికి ఆయనెందుకు వెనకాడుతున్నారు. టిడిపికి ఏమి సంబంధమని మీడియా ముందుకు వస్తోంది ? భవనం నిర్మాణానికి అన్నీ అనుమతులు ఉన్నాయని అచ్చెన్న చూపిస్తున్న కాగితాలేవో లింగమనేనే చూపించవచ్చు కదా ? లేదూ ఆ అనుమతులన్నీ భోగస్ అని చెప్పాల్సిన సిఆర్డీఏ కూడా మాట్లాడటం లేదు. మరి తెరవెనుక ఏం జరుగుతోందో ఎవరికీ అర్ధం కావటం లేదు.