‘జ’ఘనుడే..

                                              ‘జ’ఘనుడే..                                                                                        కాంగ్రెస్ ఖతం...దేశం హతం                                                                              తెరాసకు తొలిసారి భయం మూడు పదుల చరిత్ర కలిగిన తెలుగుదేశం పార్టీ మూలనపడింది. నూటా పాతిక సంవత్సరాల వయస్సు గల కాంగ్రెస్ పార్టీ పతనావస్థకు చేరుకుంటోంది.   అడుగడుగునా అధికార దుర్వినియోగం చేసిన కాంగ్రెస్ ఆశించిన విజయాలను అందుకోలేక పోయింది. తరచూ ఆరోపణలు చేస్తూ తెగించిన తెలుగుదేశం కనీసం ఉనికి చాటుకోలేక పోయింది.  ఈ క్రమం లో రాష్ర్టంలో ప్రధాన పార్టీల పని అయిపోయినట్టేనని రాజకీయ విశ్లేషకులు తేల్చిచెబుతున్నారు. నిత్యం రాజీనామాలను సమర్పిస్తూ ఎన్నికలను ఆహ్వానించే తెరాస వర్గాల్లోనూ తొలిసారిగా భయం మొదలైంది. తెలంగాణలోని పరకాల నియోజక వర్గంలో అత్తెసరు ఓట్లతో తెరాస గట్టెక్కిన విషయం తెలిసిందే. ప్రతీసారి వేలాది ఓట్లతో విజయం మూటగట్టుకునే తెరాసకు వందల్లో విజయం అందటంతో ఖంగుతినే పరిస్ధితి దారుపురించింది.  ఇక బిజెపి విషయానికి వస్తే పాలమూరు గెలుపు కేవలం వాపు మాత్రమేనని ఆలస్యంగా గ్రహించింది. అనుకున్నది సాధించడంలో ‘జ’ఘనుడే అని తాజాగా జరిగిన 18 అసెంబ్లీ, ఒక ఎంపీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు తెలియజేస్తున్నాయి.  యువనేత జగన్ ధాటికి కాంగ్రెస్ ఖతం కాగా తెలుగుదేశం హతమైంది. వై ఎస్ మరణంతో పురుడు పోసుకున్న వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఒకవైపు కాంగ్రెస్ అధిష్టానం, మరోవైపు తెలుగుదేశం, ఇంకోవైపు తెలంగాణ రాష్ర్ట సమితి ఆరోపణలతో వెంటాడినా యువనేత వైపే జనం ఉండటం గమనార్హం.  ఓదార్పు యాత్రను అన్ని పార్టీలు ఓటు యాత్రలంటూ తూర్పార బట్టాయి. యువనేత దీక్షలను, ఫీజు పోరు నాటకాలంటూ నిందించాయి. కానీ ప్రజల కోసం పాటు పడేవారే నాయకులవుతారని, నేతలన్నది ప్రజల్లోనించే పుడతారని యువనేత నిరూపించాడు. జనం కోసం పాటు పడితే సదరు జనం ఆదరిస్తారన్న నిజాన్ని జగన్ తెలియజెప్పాడు. బొత్స, కిరణ్ ల బొంకులను, చంద్రబాబు, కేసీఆర్ ల జిత్తులకు ఓటర్లు పై ఎత్తు వేసి యువనేతను విజయశిఖరాలకు చేర్చారు. తాజా ఉప ఎన్నికల్లో దాదాపు తొమ్మిది స్థానాల్లో తెలుగుదేశం పార్టీకి డిపాజిట్లు సైతం రాకపోవడం విచారకరం. అలాగే మరికొన్ని ప్రాంతాల్లో కాంగ్రెస్ కనిపించకుండా పోవడం విచారకరం. అధికారం అంగబలం ఉన్న కాంగ్రెస్, కేవలం హంగామా తప్ప అసలు ఏమీలేని తెలుగుదేశం పార్టీలకు ఉప ఎన్నికల ఫలితాలు ఓ గుణపాఠమని చెప్పవచ్చు. కటకటాల్లో వేసి కట్టడి చేసినా, ఆరోపణ అస్త్రాలతో వేటాడినా చివరకు ఉప ఎన్నికల్లో సింహభాగం సీట్లను వైఎస్ఆర్సి కైవసం చేసుకోవడం అభినందనీయం.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: