కాపులు అగ్రవర్ణ పేదలా? బిసి లా? రెంటికి చెడ్డ రెవడా? తేల్చుకోవలసింది కాపులే!

భారత రాజ్యాంగాన్ని, భారతీయ చట్టాలను ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఒక జోక్ గా హాస్యాస్పధంగా మారుస్తుంది. చట్టాలంటే లక్ష్యంలేదు న్యాయమంటే గౌరవం లేదు. ఇలాంటి వాళ్ళు మన శాసనసభ్యులా అనిపిస్తుంది. నియమ నిబంధనలతో సంబంధం లేకుండా, తమ ఇష్టం వచ్చినట్లు బిల్లులను, తీర్మానాలను ఆమోదించేసి, చేతులు దులుపు కోవడమే ప్రభుత్వ కర్తవ్యమా! పరిస్థితి మరీ దయనీయంగా మారుతుంది. 


అందుకు తాజా ఉదాహరణ కాపు సామాజికవర్గానికి  అగ్రవర్ణ పేదలకు కొత్తగా కేంద్రం చట్టం ద్వారా తీసుకొచ్చిన రిజర్వేషన్ లలో ఐదు శాతం పప్పుబెల్లంలా కేటాయించుతూ  ఏపి శాసనసభ బిల్లును ఆమోదించడమే మన ధౌర్భాగ్యం. అసలు ఈ వివాదాస్పద బిల్లును గవర్నర్ ఆమోదిస్తారా? రాజ్యాంగానికి అనుగుణంగా లేదని బిల్లును వెనక్కి పంపుతారా? అప్పుడు కేంద్రంపై, బిజెపిపై నెపం నెట్టి ఎన్నికలలో ప్రచారం చేసుకుంటారా?  అన్నచర్చ చంద్రబాబు అంతరంగంపై ఎదపి సమాజంలో తీవ్రంగా జరుగుతుంది. 

కొద్ది నెలల క్రిందట చంద్రబాబు నాయుడు కాపులను బిసిలలో చేర్చుతూ బిల్లుపెట్టి, దానిని ఆమోదించి కేంద్రానికి పంపించారు. దాన్ని పట్టించుకున్న నాధుడే కరువయ్యాడు. అప్పట్లో కాపు రిజర్వేషన్ బిల్లు ఆమోదించిన తీరు కూడా వివాదాస్పదం అయింది.  బిసి కమిషన్ చైర్మన్ తో సంబందం లేకుండా, కొందరు సభ్యులతో నివేదిక రాయించుకుని హడావుడిగా బిల్లు ఆమోదించి కేంద్రానికి పంపారు. అది ఆమోదం పొందదన్న సంగతి అప్పుడు చంద్రబాబుకు కాపు మంత్రులకు కూడా క్షుణ్ణంగా తెలుసు.   

ఆ విషయాన్ని కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఇతర కాపు నేతలు గట్టిగానే విమర్శించారు. అయినా చంద్రబాబు అప్పట్లో కాపులను వెనుకబడిన కులం (బిసి) గా ప్రచారం చేసి కాపు మంత్రులతో సన్మానాలు కూడా చేయించుకున్నారు. కాని ఇంతవరకు కాపులకు బిసి హోదాగాని ధృవపత్రంగాని ఇచ్చిన దాఖలాలు లేవు. అసలు అందుకు అనుగుణంగా ప్రభుత్వ ఉత్తర్వులే ఇవ్వలేదట.  ఇదంతా ఒక మోస పూరిత ప్రక్రియగా ఉంటే,  తాజాగా చేసిన రిజర్వేషన్ బిల్లు మరింత మోసం పూరితంగా ఉంది. 

కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం దేశ వ్యాప్తంగా అగ్రవర్ణ పేదలకు పది శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాజ్యాంగ సవరణ చేసింది. అందులో ఎక్కడా అగ్రవర్ణ కులాల మద్య ఎంతెంత శాతం ఇవ్వాలి  అన్న విషయం ప్రస్తావించలేదు. ఎవరు పేదలైతే వారికి అది అమలు అవుతుంది. ఇప్పుడు కాపులు ఏపిలో బిసిలుగా గుర్తించబడితే వారికి ఈ రిజర్వేషన్ వర్తించదు. అది రాజ్యాంగ సవరణ కాబట్టి రాష్ట్రాలు వాటి ఇష్టం వచ్చినట్లు విభజించు కోవటానికి గాని, పంపకాలకు గాని,  మార్చుకోవటానికి గాని అవకాశం ఉండదని న్యాయ నిపుణులు చెబుతున్నారు.

అడ్డగోలుగా తనకులేని అధికారం వినియోగించుకొని - అందు ఐదు శాతం కోటాను కాపులకు ఇస్తూ బిల్లును ఆమోదించినట్లు టిడిపి ప్రభుత్వం ప్రకటించింది. దీని గురించి నిలదీయ వలసిన అదికార పార్టీ సభ్యులు మౌనం ప్రదర్శించటం ద్వారా కాపు సమాజానికి వీరు ద్రోహం చేస్తున్నారన్న విమర్శలు ఎదుర్కుంటున్నారు.  ప్రస్తుతం మంత్రి మండలిలో ఉన్న కాపు మంత్రులకు స్వార్ధం తప్ప వ్యక్తిత్వం లేదని ప్రచారంలో ఉంది. ఆ పీడ వదుల్చుకోవటానికే చీరాల శాసనసభ్యుడు టిడిపికి రాజీనామా చేసేపనిలో ఉన్నారట.  గతసారి బిసిలలో కలిపినందుకు కాపులు చంద్రబాబుకు సన్మానాలు చేశారు. మరి ఈసారి మళ్లీ కాపులను అగ్రవర్ణాలలోకి తెచ్చినందుకు సన్మానాలు చేయలేదింకా! బహుశ ఎన్నికల ముంగిట్లో చెస్తారేమో తెలియదు. 


ఇంతకీ కాపులను చంద్రబాబుకాని, ఆయన ప్రభుత్వంకాని వెనుకబడిన వర్గం కింద చూస్తారా? లేక అగ్రవర్ణాల కింద చూస్తారా? ఒకసారి బిసిలుగా బిల్లు పెట్టి ఆమోదించిన తర్వాత దానిని రద్దు చేయకుండా మళ్లీ అగ్రవర్ణం కింద గుర్తించి ఇలా రిజర్వేషన్లు ఇస్తున్నట్లు ప్రకటించవచ్చా? ఆది రాజ్యాంగపరంగా నేరమైతే ఆ బిల్లును ఆమోదించిన శాసనసభనే అభిశంసించ వచ్చా? 


అసలు పార్లమెంట్ ఆమోదించిన చట్టానికి రాష్ట్రంలో శాసనసభ సవరణలు చేసి ఆమోదించటం సరైనదేనా?  అలాంటి అదికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుందా? బిసిలలో కలుపుతామని ఇచ్చిన హామీని నెరవేర్చాలని కాపు కులం ఉద్యమించినప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఎంత ఘోరంగా వారిని అవమానించిందో? వారు మర్చిపోవాలన్నది చంద్రబాబు లక్ష్యం కావచ్చు. కాని మనసు తగిలిన గాయం అంత తేలికగా మానుతుందా?  కాపులు తమ ఆత్మగౌరవాన్ని చంద్రబాబు దెబ్బతీశారని భావిస్తూ ఎప్పుడు దెబ్బకొట్టాలా? అని ఆలోచిస్తున్నారు.

అప్పుడు బిసిలకు, కాపులకు తగాదా పెట్టిన చంద్రబాబు ఇప్పుడు అగ్రవర్ణ పేదల కోటాలో ఐదు శాతం ఇస్తున్నామని చెప్పి కాపులకు, ఇతర అగ్రవర్ణాల మధ్య చిచ్చు రగులుస్తున్నారని  కాపు నేతలు వాపోతుంటే,  కోటా పంపకం జరిగితే అప్పుడు మన పరిస్థితి ఏమిటని  మిగిలిన కులాల్లో ద్వేష బావనలు పొడచూపటానికి టిడిపి ప్రభుత్వం ప్రయత్నిస్తుందనే భావన ప్రజల్లో బలంగా ఉంది. ఇలా చంద్రబాబు కులాలమద్య కుంపట్లు రగిల్చి వారు వీరు పోరాడుకుంటుంటే తన సామాజికవర్గాన్ని మరింతగా శక్తివంతం చేసుకునేదిశలో ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది. బలమైన కాపు సామాజిక వర్గాన్ని ఇతర కులాల నుండి వేరు చేసి వారిలో కూడా ఐఖ్యత దెబ్బ తీస్తే తన పబ్బం గడుస్తుందనేది చంద్రబాబు అభిబాషణ అనేది రాజకీయ విశ్లేషకుల భావన  కూడా!  

దీనిపై తాము కోర్టుకు వెళతామని, ఈబిసి సంఘాలు చెబుతున్నాయి.  బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, రెడ్డి, కమ్మ, వెలమ, కాపు తది తర కుల సంఘాల నేతలు చెబుతున్నారు. ఇదంతా ఒక సంధర్భమైతే అసలు ఈ వివాదాస్పద బిల్లును గవర్నర్ ఆమోదిస్తారా? అనేది మరో ఆలోచన. రాజ్యాంగానికి అనుగుణంగా లేదని బిల్లును వెనక్కి పంపుతారా? అప్పుడు కేంద్రంపై, బిజెపిపై, నెపం నెట్టి ఎన్నికలలో టిడిపి చంద్రబాబు ప్రచారం చేసుకునే కోణంలో రాజకీయాలు పుంజుకుంటున్నాయి. అదే జరిగితే చంద్రబాబు అంతరంగం తెటతెల్లం అయిన ఈ తరుణంలో అన్నీ కులాలు వర్సెస్ చంద్రబాబు అవటం అన్న చర్చ చాపకింద నీరులా నడుస్తుంది. 

ఏది ఏమైనా కాపులను అటు బిసిలలో లేకుండా,ఇటు అగ్రవర్ణాలలో కాకుండా, వారిని రెంటికి చెడ్డ రేవడిని చెయ్యాలనే ఆలోచన వారి జన్మ విరోధి అయిన చంద్రబాబు సామాజిక వర్గానికి ఉందని అంటున్నారు. అందుకే చంద్రబాబు  వారిని అవమానాల పాలు చేసి, సమాజంలోని ఇతర వర్గాలకు వారిని దూరం చేసేలా చేస్తున్నఈ ప్రయత్నాలు దుర్మార్గమే నని అంటున్నారు కొన్ని సామాజికవర్గాలు. 

చంద్రబాబు ఇలా మోసపూరితంగా వ్యవహరించడం కన్నా, నిజాయితీగా తను ఎన్నికల హామీలో కాపుల రిజర్వేషన్ అమలు హామీ ప్రకటించినా, అది సాధ్యం కాదని తేలిందని, అందువల్ల తనను క్షమించాలని కోరుకుంటే రాజకీయంగా హుందాగా ఉంటుందని కూడా అంటున్నారు. అలా కాకుండా  ఒక మోసాన్ని కప్పిపుచ్చడానికి మరికొన్ని మోసాలు చేసే ప్రక్రియలోకి చంద్ర బాబు వెళ్లడం దురదృష్టకరం అంటున్నారు విశ్లేషకులు.

బలమైన ఈ కాపు సామాజిక వర్గం చంద్రబాబుకు చెయ్యిస్తే, కాడి కిందేసి, కమతం వదిలేసి, కాటికి పయనం అవ్వాల్సిందే రాజకీయంగా. రాజకీయంగా చంద్రబాబు సెల్ఫ్-గోల్ చేసుకొన్నట్లే! 

ఇక తేల్చుకోవలసింది కాపులే. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: