అంతేసంగతులు

 హైదరాబాద్: ధర్మాన మంత్రి పదవీ రాజీనామా వ్యవహారంపై కాంగ్రెస్ అధిష్టానం చేతులెత్తేసింది. ధర్మాన రాజీనామాపై నిర్ణయం తీసుకునే బాధ్యత ముఖ్యమంత్రి కిరణ్ దేననీ, రాష్ర్ట పార్టీ వ్యవహారాల పరిశీలకుడు వాయిలార్ రవి తేల్చారు. ధర్మాన, సీబీఐ దర్యాప్తులో ఎవరూ జోక్యం చేసుకోరనీ చెప్పారు. రవి మాటలు సీబీఐ అభియోగాలను ఎదుర్కొంటున్న వారి గుండెల్లో రైళ్లుపరుగెత్తిస్తున్నాయి. ఏదైనా చేసి ఈ కేసుల నుంచి తమల్ని అధిష్టానం కాపాడుతుందనుకున్న వారికి వాయిలార్ ఊహించని షాక్ ఇచ్చారు. ఇక ఈ కేసు నుంచి గట్టెక్కడం ఎలా? అని టెన్షన్ అంతకుఅంత పెరిగిపోతోంది. రవి మాటల్ని బట్టి ధర్మాన రాజీనామా అమోదం తప్పని సరి కనిపిస్తోంది. ధర్మాన రాజీనామాను అమోదించిన మరుక్షణమే సీబీఐ అరెస్టు చేస్తోంది. ధర్మాన అరెస్టవుతే గీతారెడ్డి, పొన్నాల, కన్నా, సబితారెడ్డిల అరెస్టు రేపు కాకపోయినా ఎల్లుండైనా కావడం తథ్యం. ధర్మాన రాజీనామా, సీబీఐ అభియోగాలపై కాంగ్రెస్ అధిష్టానం వద్ద మాట్లాడాల్సిందిగా రాష్ర్టానికి చెందిన 24మంది మంత్రులు మూటగట్టుకుని సీఎంపై ఒత్తిళ్లు తెచ్చారు. మరోవైపు పీసీస చీఫ్ బొత్స, ఎంపీ కిళ్లి తదితరులు ఢిల్లీలో ముమ్మరంగా లాబీయింగ్ చేస్తున్నారు. అయినప్పటికీ కాంగ్రెస్ అధిష్టానం ఏమాత్రం తలొగ్గడం లేదు. మంత్రులను వెనకేసుకుని రావడమంటే జగన్ను కూడా ఈ కేసు నుంచి తప్పించినట్టే అవుతుందన్న ఆలోచనలో కాంగ్రెస్ అధిష్టానం ఉన్నట్లు పార్టీ నాయకుల ద్వారా తెలుస్తోంది. ఐదారుగురి కోసం చూస్తే కాంగ్రెస్ తన ప్రతిష్టను చూస్తూచూస్తూ మంటగల్పుకోవడానికి ఇష్టపడటం లేదనీ సమాచారం. ధర్మాన ఉత్తరాంధ్రలో బలమైన నాయకుడు. పార్టీలో మూడు దశబ్దాల తరబడిగా పనిచేస్తున్నాడు. అలాంటి నాయకుడిని రక్షించడానికి కాంగ్రెస్ వెనకాడుతోందంటే మిగతా మంత్రుల పరిస్థితి గురించి వేరే చెప్పనక్కర్లేదు. అభియోగాలు ఎదుర్కొంటున్న మంత్రులందరి అరెస్టు అనివార్యంగానే కనిపిస్తోంది. ఇప్పటి దాకా అధిష్టానంపై ఆశలుపెట్టుకున్న వారి సంగతి అంతేసంగతులన్నమాట.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: