రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పడం కష్టం. ప్రజాదరణే ప్రాధాన్యంగా ఎవరైనా గెలుపు గుర్రం ఎక్కాలి. ఎవరికి వారు ఎన్ని అంచనాలు వేసుకున్నా.. చివరికి ప్రజాభిప్రాయం, ప్రజలు వేసే ఒట్లే రాజును, రెడ్డిని నిర్ణయించేది. పాలన బాగుందని, ప్రపంచం మొత్తం మెచ్చుకుంటోందని, ఏపీని సింగపూర్ చేస్తానని, రాజధానిని ప్రపంచ స్థాయి నగరాన్ని చేస్తానని ఇలా ఎన్ని చెప్పినా.. అంతిమంగా చంద్రబాబు వ్యాఖ్యలను విశ్వసించాల్సిందీ.. ఓట్లు కురిపించా ల్సిందీ.. ప్రజలే. దీంతో చంద్రబాబు ఇప్పుడు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.

మరో పది మాసాల్లోనే ఎన్నికలు జరగనున్నా యి. ఈ నేపథ్యంలో బాబు గెలుపుపై ధీమా ఉన్నప్పటికీ.. కొందరు ఎమ్మెల్యేల విషయంలోనే ఆయన శంకిస్తున్నారు. వారు చేస్తున్న దందాలు, దౌర్జన్యాలు, వసూళ్లు వంటివి.. ఎన్నికల్లో తీవ్రంగా ప్రభావం చూపుతాయని అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో అలాంటి అభ్యర్థులకు టికెట్ ఇవ్వకుండా పక్కన పెట్టడం ద్వారా తాను సేఫ్ కావాలని భావిస్తున్నారు. ఎమ్మెల్యేలపై తీవ్ర వ్యతిరేకత ఉన్న నియోజకవర్గాలలో వారికి ప్రత్యామ్నాయంగా వేరే వారికి అవకాశం ఇవ్వాలని చంద్రబాబు భావిస్తున్నారు. అయితే ఈ విధానంపై కొందరు భిన్నాభిప్రాయం వ్యక్తంచేస్తున్నారు.

ఒకవేళ ఎమ్మెల్యేని మార్చాలని ప్రయత్నిస్తే.. రెబల్స్‌గా వారు బరిలోకి దిగి కొత్తగా టిక్కెట్ ఇచ్చినవారిని ఓడించేందుకు ప్రయత్నిస్తారనీ, అదే జరిగితే పార్టీకి నష్టమనీ వాదిస్తున్నారు. అందువల్ల ముందే ఆయా శాసనసభ్యులను పిలిపించి తత్త్వం బోధపడేలా అన్ని విషయాలు వివరిస్తే మంచిదని అంటున్నారు. ఒకవేళ ఎవరికైనా టిక్కెట్ నిరాకరించే పరిస్థితి వస్తే... పార్టీ మళ్లీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఏదో ఒక నియామక పదవి వారికి కట్టబెట్టే విధంగా ఒప్పిస్తే మంచిదని అభిప్రాయపడుతున్నారు.
సదరు నేతలు అందుకు అంగీకరించని పక్షంలో పార్టీ నుంచి వారు వెళ్లిపోయినా లెక్కచేయకూడదని అంటున్న వారూ ఉన్నారు. అయితే, బాబులో మాత్రం.. ఒకింత బెరుకు పొడసూపుతోంది. వ్యతిరేక ప్రచారం ప్రారంభిస్తే.. తనకు ముప్పేనని ఆయన జంకుతున్నారు. ఇదిలా ఉంటే, క్షేత్రస్థాయిలో వ్యతిరేకత ఉన్న పార్టీ ఎమ్మెల్యేలు ఎవరు అన్నదానిపై ప్రస్తుతం టీడీపీలో వాడివేడి చర్చ జరుగుతోంది.
పార్టీ చేయిస్తున్న అంతర‌్గత సర్వే వివరాలు ఎమ్మెల్యేలకు లీకవుతున్నాయి. దీంతో వారు చంద్రబాబుకు దగ్గరగా ఉండే ముఖ్య నేతల వద్ద తమ మనసులో ఉన్న ఆందోళనను వ్యక్తంచేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఎంతమంది సిట్టింగ్‌లను మార్చే అవకాశం ఉందన్న విషయం స్పష్టం కానప్పటికీ.. ఆ జాబితాలో తమ పేరు ఉందో లేదో అంటూ కొందరు ఎమ్మెల్యేలు వ్యాఖ్యానిస్తున్నారు. మొత్తంగా టీడీపీలో కొత్త కలవరం ప్రారంభమైంది.