నామా నాగేశ్వరరావు పేరు చెపితేనే ఏపీ సీఎం చంద్రబాబుకు ఎంత సన్నిహితుడో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఖమ్మం జిల్లా రాజకీయాలను ప్రస్తుత మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శాసిస్తోన్న టైంలో (ఆయన టీడీపీలో ఉన్నప్పుడు) ఆయనకు పోటీగా చంద్రబాబు నామాను తెరమీదకు తెచ్చారు. తుమ్మల ఎవరిని అయినా లెక్క చేయరు..అదీ ఆయన స్టైల్. జిల్లాలో తుమ్మల ప్రాబల్యాన్ని తగ్గించాలని తగ్గించాలని భావించిన చంద్రబాబు మధుకాన్ కంపెనీల అధినేతగా ఉన్న నామాను జిల్లా రాజకీయాల్లోకి తెచ్చారు.
2004లో ఎంపీగా పోటీ చేసిన నామా నాగేశ్వరరావు రేణుకా చౌదరి చేతిలో ఓడిపోయారు. 2009 ఎన్నికల్లో నామా ఎంపీగా గెలవగా, తుమ్మల ఖమ్మం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. అప్పటి నుంచి ఇద్దరు జిల్లా టీడీపీలో వేర్వేరు గ్రూపులకు ప్రాథినిత్యం వహిస్తూ వచ్చారు. చంద్రబాబు నామాకే ప్రయారిటీ ఇవ్వడంతో తుమ్మల విసిగిపోయారు. గత ఎన్నికల్లో ఖమ్మం నుంచి పోటీ చేసిన తుమ్మల ఓడిపోగా అక్కడ నామాకు 22 వేల మెజార్టీ వచ్చింది. దీనిని బట్టి వర్గ విబేధాలు ఎలా ఉన్నాయో అర్థమవుతోంది.
ఎన్నికల్లో ఓడిపోయిన తుమ్మల తర్వాత టీఆర్ఎస్లో చేరి మంత్రి అయ్యారు. ఇక ఖమ్మం జిల్లాలో టీడీపీకి పెద్ద దిక్కుగా ఉంటోన్న నామాకు ఆ పార్టీలో ఫ్యూచర్ లేదని అర్థమవ్వడంతో ఆయన పార్టీ మారాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే నామా బీజేపీలో చేరి వచ్చే ఎన్నికల్లో ఖమ్మం నుంచి ఎంపీగా పోటీ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. ఇదే విషయాన్ని ఆయన చంద్రబాబుకు కూడా చెప్పగా బాబు మౌనం వహించినట్టు తెలుస్తోంది.
నామా ప్రయత్నాలు ఎలా ఉన్నా ఆయన బీజేపీలో చేరేందుకు చంద్రబాబు ఎంత వరకు గ్రీన్‌సిగ్నల్ ఇస్తారన్నది మాత్రం డౌటే. ఇక నామా కూడా పార్టీ మారిపోతే ఖమ్మం జిల్లాలో ఇప్పటి వరకు టీడీపీకి పెద్ద దిక్కుగా ఉంటోన్న కీలక నేతను ఆ పార్టీ కోల్పోవాల్సి ఉంటుంది. తెలంగాణలో పూర్తిగా వీక్ అయిపోయినా ఖమ్మం జిల్లాలో కాస్తో కూస్తో పట్టు నిలుపుకుంటోన్న టీడీపీని నామా వీడితే ఆ పార్టీ మరింత పతనమైనట్టే.