హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు వి.హన్మంతరావు ఎప్పుడేమీ మాట్లాడుతాడో ఎవరికీ తెలియదు. ఇప్పుడు ఏకంగా తాను ఉంటున్న పార్టీకి వ్యతిరేకంగానే పోరాటం చేస్తానంటున్నాడు. పార్టీ, ప్రభుత్వ పటిష్టత కోసం వేసిన మంత్రి ధర్మాన కమిటీని తప్పుబడుతూ కార్యకర్తల మనోగతాన్ని తెలుసుకోవడానికి మేధోమథనం నిర్వహించాలంటూ వీహెచ్ గాంధీభవన్ ఆవరణలో దీక్షకు దిగుతానంటూ ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. కార్యకర్తల పేరిట వకల్తా పుచ్చుకుని మాట్లాడుతున్నటు పైకి బిల్డప్ ఇస్తున్నప్పటికీ వీహెచ్ మనసులో మరోటి ఉందనేది పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. నాటి రాజశేఖర్ సర్కార్, నేటి కిరణ్ సర్కార్ వీహెచ్‌కు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వకపోవడమే ఆయన గుస్సాకు అసలు కారణంగా తెలుస్తోంది. ఇదే అభిప్రాయాన్ని ఆయన పరోక్షంగా వ్యక్తం చేశారు కూడా. పార్టీలో తనలాంటి సీనియర్లకు విలువలేకుండా పోయిందనీ ఆవేదన చెందారాయన.
ఇందిరమ్మ కుటుంబానికి విధేయుడనంటూ చెప్పుకునే వీహెచ్ స్వపక్షంలోనే విపక్ష నేత. పార్టీ నాయకత్వానికి వ్యతిరేకంగా మౌన దీక్షకు దిగుతాడట. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి ఉన్నన్ని రోజులు సైలెంట్‌గా ఉన్న వీహెచ్...తరువాత కొంత స్వరాన్ని పెంచారు. రాజశేఖర్ రెడ్డిపై, ఆయన కుటుంబంపై తనకున్న అక్కస్సును రోజుకో మాదిరిగా వెళ్లగక్కుతున్నాడు. అది ఎంత వరకు వెళ్లిందంటే రాజశేఖర్ రెడ్డి కుమారుడైన, కడప పార్లమెంటు సభ్యుడు జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడి సొంత పార్టీ పెట్టే వరకు. అయినప్పటికీ వైఎస్ కుటుంబంపై వీహెచ్ కోపం చల్లారలేదు. ఇప్పుడు కిరణ్ సర్కార్‌ను టార్గెట్‌గా చేశారు. సిరిసిల్ల పర్యటనకు వెళ్లిన వైఎస్ సతీమణి విజయమ్మకు ఇవ్వాల్సిన పోలీస్ భద్రతకంటే అధికంగా ఇచ్చారనీ, కిరణ్ సీఎంగా ఉంటే కాంగ్రెస్‌కు కష్టకాలమంటూ కొత్త రాగాన్ని ఎత్తుకున్నారు.
వైఎస్ఆర్ పార్టీతో కిరణ్ సర్కార్ మిలాఖత్ అంటూ స్వరాన్ని పెంచారు. మరో అడుగు ముందుకేసి జగన్‌కు కిరణ్ కోవర్టంటున్నాడు. ఇలాగయితే కష్టమంటున్న వీహెచ్ తీరుపై పార్టీలో భిన్నస్వరాలు వ్యక్తమవుతున్నాయి. వైఎస్ జగన్ అరెస్టు సందర్భంగా వైఎస్ విజయమ్మను దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి భార్య అని కూడా చూడకుండా దిల్ కుష్ గెస్ట్ హౌజ్ వద్ద పోలీసులు అనుచితంగా ప్రవర్తించినది కిరణ్ సర్కార్ హయాంలో కాదా? అని ప్రశ్నిస్తున్న వారు ఉన్నారు. దివంగత రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉన్న వీహెచ్ ఇప్పుడు లేనిపోని ఆరోపణలు చేయడం, అక్కస్సును వెలిబుచ్చడం సరైంది కాదంటున్నారు. వైఎస్ ఉన్నప్పుడు వీహెచ్ అనుకున్నంతగా సాగలేదనీ, దీనితోనే ఇప్పుడు వైఎస్ కుటుంబంపై వీహెచ్ దుమ్మెత్తిపోస్తున్నాడే తప్ప మరొకటి కాదనీ అంటున్న వారు పార్టీలో లేకపోలేదు.
ఇదిలా ఉంటే ఓ వైపు వైఎస్ కుటుంబంపై, మరో వైపు కిరణ్ సర్కార్‌ను టార్గెట్ గా చేసుకుని ఆరోపణలను సంధిస్తున్న వీహెచ్ అంతటితో ఆగకుండా ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఉన్న దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి ఫోటోను తొలగించాలంటున్నారు. దీనితోనే వీహెచ్ అసలు నిజస్వరూపం బయటపడ్డదనీ కాంగ్రెస్‌లోని వారే అంటున్నారు. ఇందిరమ్మ కుటంబానికి విధేయుడనీ చెప్పుకోవడమే తప్ప రాష్ర్టంలో కాంగ్రెస్ పార్టీ పటిష్టత కోసం ఆయన చేసిందేమీ లేదనే వారున్నారు. రాష్ర్టం విషయం ఎందుకు ఆయన సొంత నియోజకవర్గమైన అంబర్ పేటలోనే అభ్యర్థిని గెలిపించుకోని వారు కిరణ్ సర్కార్ పై మాట్లాడటం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. వీహెచ్ వైఎస్ కుటుంబంపై, కిరణ్ పై వ్యక్తిగత కోపంతోనే మాట్లాడుతన్నట్లు అగుపిస్తుందనీ కాంగ్రెస్ లోని ద్వితీయశ్రేణి నాయకులు బహిరంగంగానే అంటున్నారు. వీహెచ్ మాటలను నమ్మితే రాష్ర్టంలో పార్టీకి నష్టమే తప్ప లాభమేమీ ఉండదంటున్నవారు లేకపోలేదు.
పార్టీలో ఉంటూ పార్టీ నాయకత్వాన్ని ధిక్కరిస్తున్న వారిపై అధిష్టానం క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలనీ, లేదంటే పార్టీ రాష్ర్టంలో మనుగడ సాధించడం కష్టమంటున్నారు. పార్టీ అధిష్టానం వాస్తవాలు గ్రహించకపోతే కాంగ్రెస్ పుట్టి పూర్తిగా మునగడం ఖాయమనీ ద్వితీయశ్రేణి నాయకులు అభిప్రాయపడుతున్నారు. అధిష్టానం ఎలా వ్యవహారిస్తుందో కాలమే నిర్ణయించాలి మరి.
మరింత సమాచారం తెలుసుకోండి: