మాటల మూటలతో నేతల పరుగులు

తోచినట్టుగా అందరి రాతలు బ్రహ్మే రాస్తాడు,నచ్చినట్టుగా నీ తలరాతను నువ్వే మార్చాలి..అన్నపాటను ఆసాంతం ఒంట పట్టించుకున్న మన నేతలు అదేపనిలో తలమునకలయ్యారు.అధికారం కోసం ఆఘమేఘాల మీద ప్రజలవద్దకు పరుగులు మొదలుపెట్టారు. అధికారాన్ని ఆ బ్రహ్మ ఎవరికి రాసారో తెలియదు కాని ఆరాతను తమ నుదుటిపై రాసుకునేందుకు పార్టీల నేతలంతా పాట్లు పడుతున్నారు. సమయం:2014, లక్ష్యం: రాష్ట్రంలో అధికారం. దీని కోసం ఆట మొదలైంది. ఈ ఆటలో ఎవరి గేమ్ ప్లాన్ వారిదే.... అధికార పార్టీది ఇందిరమ్మ బాట, ప్రధానప్రతిపక్షం తెలుగుదేశంది బి.సి.ల పాట.వైఎస్సార్ కాంగ్రేస్ పార్టీదేమో సమస్యలపై సమర శంఖారావం, టిఆర్ఎస్ ది పాత చింతకాయపచ్చడే ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటే, వామపక్షాలది పోరుబాట ఇలా ఎవరి మార్గంలో వారు ప్రజల మనసు దోచుకునేందుకు పక్కా గేమ్ ప్లాన్ వేసుకున్నారు. మాటల మూటలతో వస్తున్న నేతలను మహముద్దుగా చెంతకు రానిస్తున్నారు జనం. ఇది చూసి ఉబ్బితబ్బిబ్బవుతున్నారు నాయకగణం. రాష్ట్రంలో ప్రస్తుతం కన్పిస్తున్న రాజకీయవాతావరణం ఇది. విజయానికి విశిష్టవీరులు బీసీలేనని,ఆసంఘానికి చెందిన కొందరు నేతలతో సమావేశమై చంద్రబాబునాయుడు వారిపై వరాలజల్లులు కురిపించాడు. వాటి సాధనకోసం పోరాటం చేస్తానన్నారు. బాబు ఎప్పుడో చేసేదిమిటి అంటూ బిసిలలో ఒకరైన చేనేతల చేయూతకోసం కరీంనగర్ జిల్లా సిరిసిల్లలో వైఎస్ఆర్ సిపి విజయరథ సారథి విజయమ్మ నేరుగా ఆందోలనకు దిగి చేసి చూపించారు. ఇలాంటి అవకాశం లేని అధికారపార్టీ ఇందిరమ్మబాట పేరుతో ఏకంగా అధికారిక కార్యక్రమాన్నే ప్రారంభించింది. ప్రైవేటు ప్రచారం చేయాలంటే వారి వద్ద కాసులు లేవట, ఇలాగైతే ప్రభుత్వ సొమ్ముతోనే పార్టీ సోకును పెంచుకోవచ్చన్నది వారి గేమ్ ప్లాన్.తెలంగాణ సాధనపేరుతో రకరకాల సంఘాల,జేఏసిల సమావేశాలు పెడుతూ ఇన్నాళ్లు మౌనంగా ఉన్న టిఆర్ఎస్ అధినేత వీరందరిని చూసి ఊగిపోయి మాట్లాడుతున్నారు. ఇదిగోతెలంగాణ అదిగోవచ్చే అంటూ జోస్యం మొదలుపెట్టారు. ఇక ఎర్రనేతల రూటు ఎప్పుడూ ఒకటే, ధరలు పెరిగితే లొల్లి,అక్రమాలు జరిగితే ఆందోలన,అన్యాయం జరిగితే హంగామా . ఇప్పుడు కూడా అవే మొదలుపెట్టారు.కమలనాథుల ఆశలు అంతాఇంతా కావు తెలంగాణ మాతోనే వస్తుందని మహాదర్జాగా చెబుతూ రాష్ట్రం అంతటా ఆశలు పెట్టుకోక తెలంగాణతో తెగ మురిసిపోతున్నారు.లోక్ సత్తా రూటే సపరేటు, ఎందుకంటే అధికారం రాదని ఆపార్టి అధినేతతో సహా అందరికీ తెలిసిందే. అందుకే సందుదొరికితే చాలు అందరిని మాటలతూటాలతో వాయించడం ఆపార్టీ అధినేత చేస్తున్నారు. ఇలా అన్నీ పార్టీలు మొదలుపెట్టిన ఆట ఏదైనా అందరి లక్ష్యం ప్రజలమదిలో చోటు సంపాదించటం. ఇక ఎవరు ఈ ఆటలో గెలుస్తారు,ఆలోగా జరుగుతున్న ఆటలో ఎన్నెన్ని వింతలు జరుగుతాయి అన్నదే మనం చూడబోతున్నది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: