అమరావతి : టీడీపీకి జేసీ సమస్యగా మారారా ?

Vijaya


ఈ నేతకు సీనియారిటి అయితే కావాల్సినంత ఉంది కానీ విచిక్షణే బొత్తిగా లేదు. ఇంతకీ సదరు నేత ఎవరంటే జేసీ దివాకరరెడ్డి. నోటికేదొస్తే అదిమాట్లాడేస్తుంటారు. ఉన్నది ఉన్నట్లు మాట్లాడేస్తుంటానని తనకు తానే కితాబిచ్చుకునే ఈ నేత కారణంగా చంద్రబాబునాయుడు ఇరుకున పడిన సందర్భాలే ఎక్కువ. బహిరంగసభల్లో మాట్లాడే సమయంలో కూడా చంద్రబాబును పొడుగుడుతున్నారో లేకపోతే తిడుతున్నారో కూడా అర్ధంకాని పద్దతిలో మాట్లాడుతారు.



ఇప్పుడు విషయం ఏమిటంటే తాజాగా రాయల తెలంగాణా అనే స్లోగన్ను వినిపిస్తున్నారు. ప్రాక్టికల్ గా తన డిమాండ్ సాధ్యంకాదని తెలిసి కూడా పదే పదే లేవనెత్తుతున్నారు. దీనివల్ల చంద్రబాబుకు చాలా సమస్యలు మొదలయ్యాయట. రాయలతెలంగాణా అంటే జేసీ ఉద్దేశ్యంలో రాయలసీమలోని అనంతపురం, కర్నూలు జిల్లాలను తెలంగాణాలో కలిపేయటమే. విభజన సమయంలో ఇదే డిమాండ్ వినిపించినా అప్పట్లో జేసీని ఎవరూ పట్టించుకోలేదు. విభజన జరిగి తొమ్మిదేళ్ళవుతోంది.



ఇంతకాలానికి జేసీ మళ్ళీ అదే డిమాండును వినిపిస్తున్నారు. దాంతో రాయలసీమలో ముఖ్యంగా కర్నూలు, అనంతపురం జిల్లాల్లోని తమ్ముళ్ళు ఇబ్బందులు పడుతున్నారట. జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానుల ప్రతిపాదనను చూపించి చంద్రబాబు, అచ్చెన్నాయుడు తదితరులు ప్రాంతీయ విధ్వేషాలను రెచ్చగొడుతున్నారంటు మండిపోతున్నారు. జేసీ తాజా డిమాండ్ తో మాజీ ఎంపీ డిమాండుకు చంద్రబాబు అనుమతి ఉందా అని జనాలు అడుగుతున్నారట. జేసీ డిమాండుతో రాయలసీమలో చిచ్చురేగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని తమ్ముళ్ళు మొత్తుకుంటున్నారట.



ఎందుకంటే జేసీ డిమాండు మీద వైసీపీ నేతలు స్ధానికంగా తమ్ముళ్ళని ఓ ఆటాడుకుంటున్నట్లు సమాచారం. జేసీ రాయలతెలంగాణా డిమాండ్ పై చంద్రబాబు స్పందించాలని రాయలసీమ మేథావుల ఫోరం డిమాండ్ మొదలుపెట్టింది. చంద్రబాబు స్పందించకపోతే జేసీ డిమాండుకు మద్దతిస్తున్నట్లుగానే భావించాల్సుంటుందని ఫోరం గట్టిగా చెప్పింది. ఏదేమైనా జేసీ తాజా డిమాండుతో ముందు ముందు టీడీపీకి రాయలసీమలో ఇబ్బందులు ఎదురవ్వక తప్పదనే అనిపిస్తోంది. ఇంత సీనియారిటి ఉండి పార్టీకి ప్లస్సవకపోగా చివరకు జేసీ మైనస్సవుతున్నారనే టాక్ పార్టీలో పెరిగిపోతోంది. మరీ సమస్యను చంద్రబాబు ఎలా హ్యాండిల్ చేస్తారో చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: