అమరావతి : టీడీపీ ముందే ప్రిపేర్ అవుతోందా ?

Vijaya


ఓటమి ఎదురైతే ఏమిచేయాలి ? ఏమి మాట్లాడాలి ? అనే విషయాలపై తెలుగుదేశంపార్టీ ఇప్పటినుండే ప్రిపేర్ అవుతున్నట్లుంది. అందుకనే రెండురోజుల నుండి దొంగఓట్ల..దొంగఓట్లు అంటు నానా రచ్చచేస్తోంది. ఎంఎల్సీ ఎన్నికల్లో గెలుపుకోసం వైసీపీ అడ్డదారుల్లో ప్రయత్నాలు చేసుకుంటోందని రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు నుండి తమ్ముళ్ళందరు ఒకపద్దతి ప్రకారం ఆరోపణలు మొదలుపెట్టారు. వీళ్ళకి సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ, రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తోడయ్యారు.



దొంగఓట్లు చేర్పించటం, వేయించటం నేరమే అనటంలో సందేహంలేదు. అయితే దొంగఓట్ల విషయంలో ప్రతిపార్టీది ఒకటే దారి. ఎవరికి అవకాశం ఉంటే వాళ్ళు దొంగఓట్లు చేర్పిస్తున్నారు, వేయించుకుంటున్నారు. ఎన్నికల ప్రచారంలో నిబంధనల ఉల్లంఘన కూడా మామూలైపోయింది. టీడీపీ అధికారంలో ఉన్నపుడు దొంగఓట్లను యధేచ్చగా చేర్పించింది, వేయించుకున్న విషయం అందరికీ తెలిసిందే. తన హయాంలో జరిగిన నంద్యాల ఉపఎన్నికలో గెలుపే ఉదాహరణ.



నిజంగానే ఎక్కడైనా దొంగఓట్లుంటే వాటిని ఎన్నికల అధికారుల దృష్టికి తీసుకెళ్ళి రద్దు చేయించచ్చు. అంతేకానీ దొంగోట్లను చేర్పించిన వాళ్ళని, దొంగఓట్లను ఆమోదించిన అధికారులను, సంతకాలు చేసిన వాళ్ళను ఎవరనీ వదిలిపెట్టేది లేదని అచ్చెన్న బెదిరించటమే హైలైట్ గా నిలిచింది. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత అందరిపైనా కేసులు పెట్టి జైళ్ళకు పంపుతామని అచ్చెన్న బెదిరించటం చాలా విచిత్రంగా ఉంది. తాను రిగ్గింగ్ చేసుకుందామని తిరుపతికి వస్తే తనను నియోజకవర్గంలోకి ఎంటర్ కానీయలేదని స్వయంగా చంద్రబాబునాయుడు చెప్పిన వీడియోలు ఇంకా యూట్యూబ్ లో చక్కర్లు కొడుతున్నాయి.



టీడీపీ, వామపక్షాల గోల చూస్తుంటే తమ అభ్యర్ధులకు ఓటమి తప్పదని మానసికంగా రెడీ అవుతున్నట్లే ఉంది. ఒకవేళ ఓడిపోతే అప్పుడు అప్పుడు దొంగఓట్లు వేయించుకోవటం వల్లే వైసీపీ అభ్యర్ధులు గెలిచారని ఆరోపణలతో గోల చేసేందుకు ఇప్పటినుండే రంగం రెడీ చేసుకుంటున్నట్లు అనుమానాలు పెరిగిపోతున్నాయి. అదే ఎక్కడైనా తమ అభ్యర్ధులు గెలిస్తే దొంగఓట్లు వేయించుకున్నా, అధికార దుర్వినియోగం చేసినా వైసీపీ అభ్యర్ధులు గెలవలేకపోయారని మార్చి చెప్పుకుంటారేమో.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: