అమరావతి : జగన్...ఆ ఒక్కపని చేస్తే సూపర్

Vijaya




అనుకున్నట్లే జగన్మోహన్ రెడ్డి అంతర్జాతీయ పెట్టుబడుల సదస్సు నిర్వహించారు. ఊహించినదానికన్నా పెట్టుబడుల ఎంవోయులు ఎక్కువగానే జరిగాయి. ప్రపంచ పారిశ్రామిక దిగ్గజాలు రెండురోజుల పాటు విశాఖపట్నంలో బాగా సందడి చేశారు. వైజాగ్ రాజధానిగా కేంద్రమంత్రులతో పాటు పారిశ్రామికవేత్తల ముద్ర కూడా పడిపోయింది. జగన్ కూడా ఊహించని స్ధాయిలో ఏకంగా రు. 13.5 లక్షల కోట్ల విలువైన ఎంవోయులు జరిగాయి. దాంతో దేశంలో ఇపుడు ఏపీ పేరు మారుమోగిపోతోందనటంలో సందేహంలేదు.



అంతాబాగానే ఉంది కానీ జగన్ ఇక్కడే జాగ్రత్తగా ఉండాలి. లక్షల కోట్ల రూపాయల పెట్టబడులకు ఎంవోయులు  కుదుర్చుకోవటం ఏ ప్రభుత్వంలో అయినా జరిగేదే. అయితే ఆ ఎంవోయూల్లో ఎన్ని వాస్తవరూపంలోకి వస్తాయన్నదే అసలైన పాయింట్. చంద్రబాబునాయుడు హయాంలో మూడు ఏళ్ళపాటు జరిగిన ఇలాంటి సదస్సులు ఎంత నవ్వుల పాలయ్యాయో అందరు చూసిందే. అప్పట్లో కూడా లక్షల కోట్ల విలువైన ఎంవోయూలన్నారు. తర్వాత చూస్తే వాస్తవరూపంలోకి పెద్దగా వచ్చిందిలేదు.



దాన్ని దృష్టిలో పెట్టుకుని జగన్ ఇపుడు జాగ్రత్తగా ఫాలోఅప్ చేయాల్సుంటుంది. కుదిరిన రు. 13.5 లక్షల కోట్ల ఎంవోయూల్లో కనీసం సగమైనా వాస్తవరూపంలోకి వచ్చేట్లు జగన్ చేయగలిగితే అది రాష్ట్రచరిత్రలో  రికార్డుగా నిలిచిపోవటం ఖాయం. పరిశ్రమలను వీలైనన్ని జిల్లాల్లో ఏర్పాటుచేయించగలిగితే అన్నీప్రాంతాలను అభివృద్ధిలోకి తీసుకొచ్చినట్లవుతుంది. అప్పుడు పరిశ్రమలు, ఉపాధి, ఉద్యోగాలు కాస్త అటుఇటుగా అన్నీ జిల్లాల్లోను ఏర్పాటవుతాయి.



రెండురోజుల అంతర్జాతీయ సదస్సు ఈ స్ధాయిలో విజయవంతం అవుతుందని జగన్ కూడా ఊహించలేదేమో. అందుకనే జగన్లో అంతటి సంతోషం కనబడుతోంది. దీన్ని అడ్వాంటేజ్ తీసుకుని పరిశ్రమల గ్రైండింగును స్పీడుచేస్తే రాష్ట్ర ముఖచిత్రం ఒక్కసారిగా మారిపోవటం ఖాయం. పరిశ్రమలు ఇపుడు గ్రౌండింగ్ మొదలుపెడితే వచ్చే ఐదారేళ్ళ తర్వాత వాటి ఫలితాలు కనబడతాయి. ఎన్నికలు దగ్గరకు వచ్చేస్తున్నాయి కాబట్టి తన హయాంలో వచ్చిన పరిశ్రమల గురించి జగన్ చెప్పుకునేందుకు అవకాశం కూడా దొరుకుతుంది. మరి జగన్ వచ్చిన అవకాశాన్ని ఏ విధంగా ఉపయోగించుకుంటారనేది ఆసక్తిగా మారింది. చూద్దాం చివరకు ఏమిచేస్తారో.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: