గోదావరి : పవన్ నెత్తిన బండేస్తున్నారా ?

Vijaya



సీనియర్ నేత చేగొండి హరిరామజోగయ్య వ్యవహారం చూస్తుంటే అందరిలోను ఇదే అనుమానం పెరిగిపోతోంది. తాజాగా ఆయన కాపు సంక్షేమ సేన తరపున సర్వే చేయించినట్లున్నారు. దాని ప్రకారం రాబోయే ఎన్నికల్లో సొంతంగా ఏ పార్టీకి అధికారం అందుకునేంత మెజారిటి రాదట. అయితే సింగిల్ లార్జెస్టు పార్టీగా వైసీపీనే నిలిచే అవకాశం ఉందని జోగయ్య జోస్యం చెప్పారు. పవన్ కల్యాణ్ నాయకత్వంలోని జనసేన గణనీయంగా పుంజుకుంటుంది కానీ అధికారానికి ఆమడదూరంలోనే ఆగిపోవటం ఖాయమని చెప్పారు.



జోగయ్య చెప్పింది చూస్తుంటే పవన్ నెత్తిన బండ పడేసేట్లే ఉన్నారు. జోగయ్య ప్రెడిక్షన్ ప్రకారం 40 శాతం ఓటు షేర్ తో వైసీపీకి 80 సీట్లు వస్తాయట. అలాగే తెలుగుదేశంపార్టీకి 38 శాతం ఓట్ షేరుతో 55 సీట్లు వస్తాయని చెప్పారు. అలాగే జనసేన 20 శాతం ఓట్ల షేరుతో 40 సీట్లలో గెలవబోతోందని జోస్యం చెప్పారు. జోగయ్య ప్రెడిక్షన్లో సూక్షమం ఏమిటంటే హంగ్ అసెంబ్లీ వచ్చే అవకాశం కాబట్టి పవనే కింగ్ మేకర్ గా ఉంటారట. దీని వల్ల టీడీపీ+జనసేన తప్పక కలవాల్సిందే అని అప్పుడు పవన్ సీఎం అయ్యే అవకాశముందని అంచనా వేశారు.



అయితే ఇక్కడ జోగయ్య మరచిపోయిన విషయం ఏమిటంటే వైసీపీ, టీడీపీ, జనసేన మూడుపార్టీలు దేనికదే పోటీచేస్తే అధికారంలోకి జగన్మోహన్ రెడ్డే వచ్చే అవకాశముందని ఇప్పటికే అనేక సర్వేలు తేల్చిచెప్పాయి. అయితే ఎన్నిపార్టీలు కలిసినా తన అధికారానికి ఢోకా అయితే ఉండదని జగన్ నమ్ముతున్నారు. ఎలా చూసినా జగన్ను అధికారానికి దూరంగా ఉంచాలన్న పవన్ కోరిక నెరవేరేట్లు లేదని తేలిపోతోంది.



క్షేత్రస్ధాయిలో వాస్తవాలు కూడా అలాగే ఉన్నాయి. పార్టీలన్నీ దేనికదే పోటీచేస్తే జగన్ ఫుల్లు హ్యాపీ. విచిత్రం ఏమిటంటే జనసేనకు 40 సీట్లు వస్తాయని జోగయ్య అంచనావేయటం. 40 సీట్లు రావటం సంగతిని పక్కనపెట్టేస్తే అసలన్నీ సీట్లలో గట్టి అభ్యర్ధులను పోటీ చేయించగలదా ? అన్నదే కీలకమైన ప్రశ్న. ఎన్నికలు వస్తే చాలు గుడ్డిగా జనాలంతా జనసేనకు ఓట్లేసేయటానికి రెడీగా ఉన్నారని జోగయ్య అనుకుంటున్నారా ? ఏమో ఏ పుట్టలో ఏ పామున్నదో బయటపడేంత వరకు తెలీదు కదా.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: