అమరావతి : సోషల్ ఇంజనీరింగ్ లో జగన్ కు తిరుగేలేదా ?

Vijaya



వర్తమాన రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి తన రూటే సపరేటని నిరూపించుకుంటున్నారు. ప్రస్తుత రాజకీయాలంతా సోషల్ ఇంజనీరింగ్ చూట్టూనే తిరుగుతున్న విషయం అందరు చూస్తున్నదే.  సామాజికవర్గాల వారీగా వివిధ నియామకాల్లో ఎవరికివ్వాల్సిన ప్రాధాన్యత వాళ్ళకి ఇవ్వటమే సోషల్ ఇంజనీరింగ్.  అలా చూసినపుడు తాజాగా ప్రకటించిన 18 మంది ఎంఎల్సీల జాబితాలో బీసీలకు పెద్దపీట వేసినట్లు అర్ధమవుతోంది. స్ధానికసంస్ధల కోటాలో 9, ఎంఎల్ఏల కోటాలో 7, గవర్నర్ కోటాలో రెండు ఎంఎల్సీలను భర్తీ చేశారు.



ఎంఎల్ఏల సంఖ్య రీత్యా, స్ధానికసంస్ధల్లో గెలుపు ప్రకారం చూస్తే పై 18 స్ధానాలు వైసీపీ ఖాతాలోనే పడతాయి. తాజా నియామకాల్లో 11 మంది బీసీలు, ఇద్దరు ఎస్సీలు, ఒక ఎస్టీ, నలుగురు ఓసీలను జగన్ ఎంపికచేశారు. సమాజంలో బీసీల జనాభా 50 శాతం ఉందికాబట్టే వాళ్ళకి జగన్ మొదటినుండి పెద్ద పీట వేస్తున్నారు. బీసీల తర్వాత కాపు, ఎస్సీ, మైనారిటి, ఎస్టీలకు కూడా బాగానే ప్రాధాన్యతిస్తున్నారు. ఈ లెక్కప్రకారమే తాజా ఎంపికలు జరిగాయి. మొత్తం ఎంఎల్సీల్లో వైసీపీ తరపున శాసనమండలిలో ఇపుడు 63 శాతం పై వర్గాలే ఉన్నాయి.



నిజానికి 11 మంది బీసీలను ఎంఎల్సీలను చేసినంత మాత్రాన మొత్తం బీసీ జనాభాకు న్యాయం చేసినట్లు కాదు. అయితే అత్యధిక జనాభా కలిగిన బీసీలకు చట్టసభల్లో ప్రాధాన్యత కల్పించటమే జగన్ ఉద్దేశ్యం. ఈ విషయంలో చంద్రబాబునాయుడు నూరుశాతం ఫెయిలయ్యారు. రాజ్యసభ, లోక్ సభ, ఎంఎల్ఏలు, ఎంఎల్సీలకు అవకాశం ఉన్నా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు అవకాశం ఇవ్వలేదు. వచ్చిన అవకాశాలను అగ్రవర్ణాలు ముఖ్యంగా కమ్మోరికే అందించారు.



ఈ విషయంలోనే బీసీలు చంద్రబాబుకు దూరమైపోయారు. దీని ఫలితమే మొన్నటి ఎన్నికల్లో టీడీపీ ఘోరపరాజయం. బీసీల ప్రాధాన్యతను గుర్తించిన జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుండే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు బాగా ప్రాధాన్యతిస్తున్నారు. అదే పద్దతిలో ఇపుడు కూడా అనుసరించారు. వచ్చేఎన్నికల్లో కూడా అఖండ విజయాన్ని అందుకోవాలని జగన్ ప్లాన్ చేస్తున్నారు. మరి తాను పాటిస్తున్న సోషల్ ఇంజనీరింగ్ ఎంతవరకు ఫలిస్తుందో వెయిట్ చేసి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: