హైదరాబాద్ : కేసీయార్-తోట బంధమిదేనా ?

Vijaya


తెలంగాణా సీఎం, బీఆర్ఎస్ జాతీయ అధ్యక్షుడు కేసీయార్ కు ఏపీలోని జనసేన కీలక నేత తోట చంద్రశేఖర్ కు మధ్య ఉన్న బంధమేంటి ? ఇద్దరినీ కలిపిన విషయం ఏమిటి ? మొదట్లో వీళ్ళిద్దరి మధ్య బంధం ఎవరికీ అర్ధంకాలేదు. కేసీయార్, తోటకు మధ్య అసలు ఎలాంటి సంబంధమూ లేదనే అనుకున్నారు. అలాంటిది జనసేన ప్రధాన కార్యదర్శి తోట పార్టీని వదిలేయటం ఏమిటి ? బీఆర్ఎస్ ఏపీ అధ్యక్షుడిగా నియమితులవ్వటం ఏమిటని చాలామందికి ఆశ్చర్యపోయారు.అయితే అందరి అనుమానాలకు, ఆశ్చర్యానికి తెలంగాణా బీజేపీ ఎంఎల్ఏ రఘునందనరావు సమాధానం చెప్పారు. ఇంతకీ ఎంఎల్ఏ బయటపెట్టిన బంధం ఏమిటంటే ఒక ల్యాండ్ సెటిల్మెంటే ఇద్దరినీ కలిపిందట. మియాపూర్లోని సర్వే నెంబర్ 78లో 40 ఎకరాల వివాదాస్పద భూమిని తోట కొన్నారట. దాన్ని కేసీయార్ దగ్గరుండి సెటిల్ చేయించారట. దాని ప్రస్తుత విలువ సుమారు రు. 4 వేల కోట్లని ఎంఎల్ఏ చెప్పారు. వేల కోట్ల రూపాయల విలువైన భూమిని తనకు వచ్చేట్లు కేసీయార్ చేశారు కాబట్టి ఒప్పందం ప్రకారం తోట బీఆర్ఎస్ లో చేరారట.ఖమ్మంలో జరగబోయే బహిరంగసభ ఖర్చు యావత్తు తోటనే భరిస్తున్నట్లు ఎంఎల్ఏ ఆరోపించారు. అలాగే ఏపీలో పార్టీ విస్తరణ ఖర్చులను కూడా తోటే భరించేట్లుగా ఇద్దరి మధ్య ఒప్పందం జరిగిందని రఘునందన్ బయటపెట్టారు. ఎంఎల్ఏ ఆరోపణలు ఎంతవరకు వాస్తవమనే విషయాన్ని ఎలాగూ కేసీయార్ చెప్పరు కాబట్టి తోటే బయటపెట్టాలి.ఎంఎల్ఏ చెప్పిందానికి కాస్త లాజిక్ ఉంది. ఎలాగంటే హైదరాబాద్ చుట్టుపక్కల పెద్దఎత్తున రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగంలో ఉన్న కంపెనీల్లో తోటకు చెందిన ఆదిత్యా ఇన్ఫ్రా కూడా ఒకటి. బీఆర్ఎస్ లోని అత్యంత కీలక నేతలతో తోటకు చాలాకాలంగా సన్నిహిత సంబంధాలున్నట్లు బాగా ప్రచారంలో ఉంది. కాబట్టి అన్నింటినీ లింకుపెట్టి చూస్తే తాజాగా ఎంఎల్ఏ చేసిన ఆరోపణలు నిజమేనేమో అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. లేకపోతే బీఆర్ఎస్ కు ఏపీలో ఇంతటి క్రేజు ఎలాగొస్తుంది ? అసలెందుకు వస్తుంది ?
మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: