అమరావతి : రెచ్చగొడతాడు..మాయమైపోతాడు

Vijaya


జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు ఇది బాగా అలవాటైపోయింది. నెలకొకసారో లేకపోతే షూటింగుల గ్యాప్ లో ఖాళీ దొరికినపుడో  బహిరంగసభ పెట్టడం ప్రభుత్వం మీదకు జనాలను రెచ్చగొట్టడం మాయమైపోవటం. బహిరంగసభలో పవన్ పూనకాలు, ఆవేశాలు నిజమే అనుకుని కొందరు అభిమానులు రెచ్చిపోయి పోలీసుల దగ్గర తగులుకోవటం మామూలైపోయింది. ఇపుడు రాబోయే 12వ తేదీన జనసేన ఆధ్వర్యంలో శ్రీకాకుళం జిల్లాలోని రణస్ధలం మండల కేంద్రంలో యువశక్తి పేరుతో బహిరంగసభ పెడుతున్నారు.



ఆ బహిరంగసభకు పవన్ హాజరవుతున్నారు. శ్రీకాకుళం జిల్లా కాబట్టి కచ్చితంగా ఉత్ధానం ప్రాంతంలో కిడ్నీసమస్యలపై ప్రస్తావించే అవకాశం ఉంది. అలాగే ప్రభుత్వ వైఫల్యాలని మరోటని జగన్మోహన్ రెడ్డిపై నోటికొచ్చింది మాట్లాడుతారు. ఉత్తరాంధ్రలో సభ కాబట్టి వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ తదితరాల గురించి మాట్లాడే అవకాశముంది. జనాల్లో సెంటిమెంటును రగల్చాలంటే స్ధానిక అంశాలను తీసుకుని సమాజంలోని సకల దరిద్రాలకు జగన్ ప్రభుత్వమే కారణమని చెప్పాలి.



పనిలోపనిగా రోడ్డుషోలు, ర్యాలీలు, రోడ్లపై సభలను నిషేధిస్తు జారీచేసిన ఉత్తర్వులపైన కూడా ఏదేదో మాట్లాడేస్తారు. ప్రభుత్వంపై తిరగబడమని జనాలను పరోక్షంగా  రెచ్చగొడతారు. పవన్ స్పీచంతా విన్న యువత లేదా ఓటుహక్కులేని అభిమానులు రెచ్చిపోతారు. ఎక్కడో ఒకచోట ప్రభుత్వంపై గందరగోళం సృష్టిస్తారు. మొన్న ఇప్పటం గ్రామంలో జరిగింది ఇదే. అంతకుముందు కోనసీమలో జరిగింది కూడా ఇలాంటిదే. కోనసీమకు అంబేద్కర్ పేరుపెట్టడాన్ని పవన్ తీవ్రంగా వ్యతిరేకించారు. నోటికొచ్చింది మాట్లాడటంతో జనసైనికులు రెచ్చిపోయారు.



మంత్రి విశ్వరూప్ ఇంటిపైన దాడి, నిప్పుపెట్టడం, ఎంఎల్ఏ పొన్నాడ సతీష్ ఇంటిపైన దాడిచేసి నిప్పుపెట్టడం, ప్రభుత్వ ఆస్తులకు, ప్రైవేటు బస్సులకు నిప్పుపెట్టేశారు. కనిపించిన ప్రతి ఆస్తిని ధ్వంసంచేసేశారు. సీసీ కెమెరాలు, వీడియోల్లో దొరికిన అందరిపైనా పోలీసులు కేసులు పెట్టారు. అలాగే వైజాగ్ఎయిర్ పోర్టులో మంత్రుల కార్లపై దాడులు చేసిన వారు కూడా కేసులను ఎదుర్కొని పోలీసుస్టేషన్లు, కోర్టుల చుట్టూ తిరుక్కుంటున్నారు. మరి రణస్ధలం మీటింగ్ తర్వాత ఏమవుతుందో చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: