అమరావతి : ఇద్దరికీ టికెట్లు ఖాయంచేసినట్లేనా ?

Vijaya


రెండు నియోజకవర్గాలకు జగన్మోహన్ రెడ్డి ఇన్చార్జిలను నియమించారు. ప్రకాశం జిల్లాలోని పర్చూరు నియోజకవర్గానికి మాజీ ఎంఎల్ఏ ఆమంచి కృష్ణమోహన్ను, వెంకటగిరి నియోజకవర్గానికి నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డిని నియమించారు. ఇందులో పర్చూరులో ప్రస్తుతం టీడీపీ ఎంఎల్ఏ ఏలూరి సాంబశివరావు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇక వెంకటగిరిలో వైసీపీ ఎంఎల్ఏ ఆనం రామనారాయణరెడ్డే ఉన్నారు. పార్టీ ఎంఎల్ఏనే ఉన్నా నేదురుమల్లిని నియమించటం గమనార్హం. గతంలో తాడికొండ నియోజకవర్గంలో ఎంఎల్ఏ శ్రీదేవి ఉండగానే ఎంఎల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్ ను ఇన్చార్జిగా వేసిన విషయం గుర్తుండే ఉంటుంది.



పర్చూరులో ఆమంచిని ఇన్చర్జిగా నియమించాలని జగన్ చాలాకాలం క్రితమే డిసైడ్ చేశారు. ఆమంచి దృష్టంతా చీరాలమీదే ఉన్నప్పటికి ఇక్కడ టికెట్ ఇవ్వటం జగన్ కు ఇష్టంలేదు. ఎందుకంటే టీడీపీ తరపున చీరాలలో గెలిచిన బలరామకృష్ణమూర్తి ప్రస్తుతం వైసీపీకి సన్నిహితంగా ఉంటున్నారు. దాంతో వచ్చేఎన్నికల్లో చీరాలలో తన కొడుకు కరణం వెంకటేష్ కు టికెట్ ఇవ్వాలని బలరామ్ అడిగితే జగన్ ఓకే చేశారని పార్టీలో టాక్. అందుకనే ఆమంచిని చీరాలలో కాకుండా పర్చూరులో పోటీచేయమని ఇదివరకే చెప్పారు.



గతంలో చెప్పినట్లుగానే ఇపుడు ఇన్చార్జిగా నియమించారు కాబట్టి ఆమంచికి  పర్చూరులో టికెట్ ఖాయమని పార్టీలో చర్చ మొదలైంది. ఇక వెంకటగిరి విషయం చూస్తే ఆనం ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. సీనియర్ అయిన తనకు మంత్రివర్గంలో చోటు దక్కుతుందని ఆశించి భంగపడ్డారు. అప్పటినుండి జగన్ పై అసంతృప్తి పెరిగిపోయింది. మంత్రి పదవి రాదని, వచ్చేఎన్నికల్లో టికెట్ దక్కేది కూడా అనుమానమే అని ఆనం కన్ఫర్మ్ చేసుకున్నట్లున్నారు.




అందుకనే బాహాటంగానే ప్రభుత్వంపై రెగ్యులర్ గా నోటికొచ్చింది మాట్లాడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ గెలవదని జోస్యం కూడా చెప్పేశారు. దాంతో ఇక ఉపేక్షించి లాభంలేదని అనుకుని వెంకటగిరికి నేదురుమల్లిని ఇన్చార్జిగా నియమించారు. అంటే ఇక్కడ నేదురుమల్లికి టికెట్ ఖాయమనే అనుకోవాలి. ఒకసారి ఇన్చార్జిగా నేదురుమల్లిని నియమించిన తర్వాత ఎంఎల్ఏగా ఆనం డమ్మీ అయిపోయినట్లే లెక్క. ఎందుకంటే నియోజకవర్గంలో పార్టీ, ప్రభుత్వ యంత్రాంగమంతా ఇన్చార్జి చెప్పిన మాటే వింటారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: