అమరావతి : బీసీలంతా టీడీపీతోనే ఉన్నారా ?

Vijaya

వాస్తవంలో కన్నా భ్రమల్లో ఉండటానికే ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబునాయుడు బాగా అలవాటుపడిపోయినట్లున్నారు. అందుకనే రోడ్డుషోలు, సభల్లో జనాలను చూడగానే ఏదేదో మాట్లాడేస్తున్నారు. తాజాగా చంద్రబాబు చెప్పిందేమంటే బీసీలంతా టీడీపీతోనే ఉన్నారట. టీడీపీకి వెన్నెముక అంటేనే బీసీలని అలాంటి బీసీలు పార్టీ పెట్టినదగ్గర నుండి టీడీపీతోనే ఉన్నారని గుర్తుచేశారు. టీడీపీని వదిలి బీసీలు వేరేపార్టీకి మద్దతిచ్చే ప్రసక్తే లేదని కూడా బల్లగుద్ది మరీ చెప్పారు.



ఇక్కడే చంద్రబాబు మాటలపైన అందరిలోను అనుమానాలు పెరిగిపోతున్నాయి. పార్టీ పెట్టిందగ్గర నుండి బీసీలు టీడీపీతోనే ఉన్నది వాస్తవమే. అదంతా ఎన్టీయార్ పుణ్యమే కానీ చంద్రబాబు గొప్పదనంకాదు. అయితే పార్టీకి అంత మద్దతుగా నిలబడిన బీసీలను కష్టపడి చంద్రబాబు దూరంగా తరిమేశారు. 2014-19 మధ్య అధికారంలో ఉండగా బీసీ సంఘాల నేతలను చాలా అవమానించారు. తోకలు కట్ చేసేస్తానన్నారు, సచివాలయంలోకి ఎవరు రానిచ్చారంటు నిలదీశారు.



తనతో మాట్లాడేటపుడు ఒళ్ళు దగ్గరపెట్టుకుని మాట్లాడాలన్నారు. పిచ్చపిచ్చ వేషాలు వేస్తే తన దగ్గర కుదరవని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. చేసేదేమీ లేక అప్పటికి మౌనంగా ఉండిపోయిన బీసీలు 2019 ఎన్నికల్లో చంద్రబాబు తోకనే కట్ చేసేశారు. దాని ఫలితమే టీడీపీ ఘోరఓటమి. టీడీపీ ఓటమికి అనేక కారణాలున్నప్పటికీ బీసీలు దూరమవ్వటం కూడా కీలకమే. ప్రతిపక్షంలోకి వచ్చారు కదా మళ్ళీ చంద్రబాబుకు బీసీలు అత్యంత ప్రేమాస్పదులైపోయారు.




ఎందుకంటే బీసీల మద్దతులేకపోతే అధికారంలోకి రావటం కష్టమని చంద్రబాబుకు బాగా తెలుసు. ఒకవైపు బీసీల మద్దతు కోసం నానా అవస్తలు పడుతు మరోవైపు బీసీలంతా టీడీపీతోనే ఉన్నారని చెప్పటంతో అందరు ఆశ్చర్యపోతున్నారు. నిజంగానే బీసీలంతా టీడీపీతోనే ఉంటే మరిపుడు బీసీల సదస్సులు ఎందుకు పెడుతున్నట్లు ? బీసీలను ఆకర్షించేందుకు హామీలెందుకు ఇస్తున్నట్లు ? బీసీలంతా టీడీపీకే మద్దతివ్వాలని ఎందుకు బతిమలాడుకుంటున్నారు ? బీసీల విషయంలో  జగన్మోహన్ రెడ్డి దెబ్బ చంద్రబాబు మీద బాగా ప్రభావం పడినట్లే అనిపిస్తోంది. మరి వచ్చేఎన్నికల్లో బీసీలు ఏమిచేస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: