అమరావతి : మార్గదర్శిలో అవకతవకలు బయటపడ్డాయా ?

Vijaya

మార్గదర్శి చిట్ ఫండ్స్ తో పాటు ఇతర ఫైనాన్స్ వ్యాపారం చేసే సంస్ధల్లో పెద్దఎత్తున అవకతవకలు జరిగినట్లు ఉన్నతాధికారులు గుర్తించారా ? ఉన్నతాధికారులు జారీచేసిన ప్రెస్ నోట్ తో అందరిలోను ఇదే అనుమానం పెరిగిపోతోంది. చిట్ ఫండ్స్ సంస్ధలు, ఫైనాన్స్ సంస్ధలపై మంగళవారం స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖ ఉన్నతాధికారులు దాడులు చేశారు. సంస్ధలకు చెందిన రికార్డులు, బ్యాలెన్స్ షీట్లు, అకౌంట్స్ పుస్తకాలను జాగ్రత్తగా తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా అనేక అవకతవకలు జరిగినట్లు గుర్తించామని అధికారులు చెప్పారు.అవకతవకలు ఏ సంస్ధల్లో గుర్తించామనే విషయాన్ని అధికారులు స్పష్టంగా చెప్పలేదు. అవకతవకలు గుర్తించామని, కొన్ని డాక్యుమెంట్లు, ఫైళ్ళని స్వాధీనం చేసుకున్నట్లు మాత్రమే చెప్పారు. అయితే ఏ సంస్ధలనుండి స్వాధీనం చేసుకున్నారో కూడా చెప్పలేదు. చందాదారుల నుండి వసూళ్ళు చేసే నిధులను పక్కదారి మళ్ళించినట్లు, చందాదారులనుండి వసూలు చేసిన జరిమానాపై ప్రభుత్వానికి జీఎస్టీ చెల్లించలేదని, చిట్ వేసే సమయంలో చందాదారుల నుండి గ్యారెంటీ తీసుకున్న సంస్ధలు అలాంటి గ్యారెంటీలను ప్రభుత్వానికి ఇవ్వలేదని, చందాదారుల నుండి నిబంధనలకు విరుద్ధంగా అడ్వాన్స్ చందాలను తీసుకుంటున్న విషయాలను గుర్తించినట్లు అధికారులు చెప్పారు.మిగిలిన సంస్ధల మాటెలాగున్నా మార్గదర్శి చిట్ పండ్స్ కు చెందిన 17 బ్రాంచీలలో కూడా అధికారులు తనిఖీలు చేశారు. మార్గదర్శిపై దాడులు చేయటమంటే మామూలు విషయంకాదు. తమ సంస్ధల అన్నింటికీ అతీతమని గ్రూపు ఛైర్మన్ రామోజీరావు అనుకుంటారని ఈమధ్యనే మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ కామెంట్ చేసిన విషయం తెలిసిందే. మార్గదర్శి ద్వారా రామోజీ నిబంధనలకు విరుద్ధంగా వేల కోట్లరూపాయలు వసూలు చేస్తున్నట్లు ఉండవల్లి సుప్రింకోర్టులో పెద్ద పోరాటమే చేస్తున్నారు.
మార్గదర్శిపై డిసెంబర్ 3వ తేదీన విచారణ జరగబోతోంది. ఈ నేపధ్యంలోనే చిట్ ఫండ్స్ సంస్ధల మోసాల పేరుతో మార్గదర్శిలో కూడా సోదాలు జరగటం సంచలనంగా మారింది. అవకతవకలు గుర్తించామని అధికారులు చెప్పారే కానీ ప్రత్యేకించి పలానా సంస్ధ అని చెప్పలేదు.  అయితే  అవకతవకలు జరిగినట్లు అధికారులు గుర్తించిన సంస్ధల్లో మార్గదర్శి కూడా ఉందనే ప్రచారం బాగా పెరిగిపోతోంది. నిజంగానే మార్గదర్శిలో అవకతవకలు గుర్తించుంటే సుప్రింకోర్టు విచారణలో ఈ విషయం హైలైట్ అవటం ఖాయం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: