అమరావతి : మార్గదర్శిపై బ్యాటింగ్ మొదలైందా ?

Vijaya






హఠాత్తుగా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖ అధికారులు చిట్ ఫండ్స్, ఫైనాన్స్ కంపెనీలపై దాడులుచేశారు. చిట్ ఫండ్స్ కంపెనీలపై దాడుల్లో భాగంగా మార్గదర్శి చిట్ ఫండ్స్ ఆఫీసులు కూడా ఉన్నాయి. విశాఖపట్నం, విజయవాడ లాంటి పెద్ద నగరాల్లో 8 మార్గదర్శి ఆఫీసులపైన కూడా దాడులు జరిగినట్లు సమాచారం. ఇక్కడ గమనించాల్సిందేమంటే చిట్ ఫండ్స్, ఫైనాన్స్ కంపెనీలని పైకి కనిపిస్తున్నా అసలు టార్గెట్ మొత్తం మార్గదర్శే అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.



జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా రామోజీరావు ప్రతిరోజు బురదచల్లేస్తున్న విషయం తెలిసిందే. చంద్రబాబునాయుడు రాజకీయప్రయోజనాలను కాపాడటంలో భాగంగానే జగన్ కు వ్యతిరేకంగా రామోజీ అనేక కథనాలు వండివారుస్తున్నారు. రాజకీయంగా చంద్రబాబు లేవకుండా దెబ్బకొట్టాలంటే అండగా ఉన్న ఎల్లోమీడియాను దెబ్బకొట్టాలన్న విషయం జగన్ కు తెలుసు. అందుకనే మార్గదర్శిపైన దృష్టిపెట్టారు. కావాలనే ప్రభుత్వంపై బురదచల్లుతున్న రామోజీని జగన్ ఒక చూపుచూడాలని అనుకున్నట్లున్నారు.  ఇప్పటికే నిబంధనలకు విరుద్ధంగా నిధులు సేకరిస్తున్నదనే కేసు మార్గదర్శిపై దశాబ్దాలుగా నడుస్తోంది. ప్రస్తుతం ఈ కేసు విచారణ సుప్రింకోర్టులో జరుగుతోంది.



మార్గదర్శికి వ్యతిరేకంగా మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ చేస్తున్న పోరాటంలో ప్రభుత్వం కూడా ఇంప్లీడయ్యింది. దాంతో రామోజీ ఆ మంటనంతా జగన్ ప్రభుత్వం చూపిస్తున్నారు. ఇంతవరకు రామోజీ సంస్ధల జోలికి వెళ్ళని జగన్ ప్రభుత్వం హఠాత్తుగా మార్గదర్శిపై పడింది. నిజానికి మార్గదర్శి చిట్ ఫండ్స్ కంపెనీ ఏర్పాటు ద్వారా నిధుల సేకరణలో రామోజీ రిజర్వ్ బ్యాంకు నిబంధనలను ఉల్లంఘించిన విషయం స్పష్టమైందని ఉండవల్లి ఎప్పటినుండో మొత్తుకుంటున్నారు.



రామోజీ చేసిన ఆర్ధికనేరం కోర్టులో రుజువైతే సుమారు రు. 6 వేల కోట్ల ఫైన్ తో పాటు జైలుశిక్ష కూడా తప్పదని ఉండవల్లి చాలాసార్లు చెప్పారు. నరేంద్రమోడీ ఏపీ పర్యటనకు వచ్చి వెళ్ళిన వెంటనే టీడీపీకి జనసేన అధినేత పవన్ కల్యాణ్ దూరంగా జరగటం, మార్గదర్శిపై అధికారులు దాడులు చేయటం లాంటి అనేక పరిణామాలు చకచకా జరిగిపోతున్నాయి. మొత్తానికి ఏపీ రాజకీయం భలే రంజుగా తయారవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: