విషవాయువు లీకేజీ ఘటనపై జగన్ సీరియస్..

Deekshitha Reddy
అచ్యుతాపురం సెజ్ లో సీడ్స్ కంపెనీ విషవాయువు లీకేజీ ఘటనపై సీఎం జగన్ సీరియస్ అయినట్టు తెలుస్తోంది. ఆయన ఆదేశాలతో మంత్రి గుడివాడ అమర్నాథ్ బాధితులను ఆస్పత్రికి వెళ్లి పరామర్శించారు. ప్రభుత్వమే వారి ఆస్పత్రి ఖర్చులను పెట్టుకుంటుందని చెప్పారు. వెంటనే సీడ్స్ కంపెనీని మూసివేస్తున్నట్టు ప్రకటించారు మంత్రి అమర్నాథ్. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు సీడ్స్ ఫ్యాక్టరీ తెరవకూడదని ప్రభుత్వం తరపున ఆయన స్పష్టం చేశారు.
గతంలో కూడా ఇదే కంపెనీలో విష వాయువు లీకేజీ ఘటన జరిగింది. దానిపై విచారణ కొనసాగుతోంది. అది జరుగుతుండగానే, మరోసారి ప్రమాదం జరగడం దురదృష్టకరం అని అన్నారు మంత్రి అమర్నాథ్. ఈ ప్రమాదానికి పూర్తి బాధ్యత సీడ్స్ కంపెనీయే వహించాలని అన్నారు మంత్రి. విషవాయువు లీకేజీ సంఘటనలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను మంత్రి పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకుని, ధైర్యం చెప్పారు. విషవాయువు లీక్‌ ఘటనలో మొత్తం 121 మంది అస్వస్థతకు గురయ్యారు. వారంతా ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మొత్తం ఐదు ఆస్పత్రులకు వారిని తరలించారు.
రెండు నెలల క్రితం ఇదే కంపెనీలో ఇలాంటి ఘటన జరిగిందని, ఇప్పుడు మరో ఘటన జరగడం దురదృష్టకరం అని అంటున్నారు మంత్రి అమర్నాథ్. గత ప్రమాదంపై ప్రభుత్వం వేసిన కమిటీ ప్రాథమికంగా ఆ కంపెనీలో కాంప్లెక్స్ రసాయనాలు ఉన్నట్లు తేల్చింది. ప్రస్తుతం ప్రమాదానికి అసలైన కారణం తెలిసే వరకు దాన్ని మూసి ఉంచుతామని అంటున్నారు మంత్రి. అటు సీఎం జగన్ కూడా ఈ ప్రమాదంపై సీరియస్ అయ్యారని తెలుస్తోంది. మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ ఆదేశించారు. పూర్తి స్థాయి ఎంక్వయిరీ చేయాలన్నారు. రాష్ట్రంలోని అన్ని కంపెనీల్లో ముందు జాగ్రత్త చర్యలు ఎలా ఉన్నాయో ఎంక్వయిరీ చేయాలన్నారు. ప్రస్తుత ప్రమాదంలో బాధితుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన మొదలైంది. ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: