ఎక్కడి చెత్త అక్కడే, ఏపీ ప్రజల అవస్థలు..

Deekshitha Reddy
ఏపీలో పారిశుధ్య కార్మికులు సమ్మె మూడో రోజుకి చేరుకుంది. చర్చలు విఫలం కావడం, ప్రభుత్వం తమ డిమాండ్లు నెరవేర్చేందుకు సుముఖంగా లేకపోవడంతో పారిశుధ్యకార్మికులు సమ్మెకొనసాగిస్తున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం సమ్మె విరమించి, ఉద్యోగులు విధుల్లోకి వస్తేనే వారి సమస్యల పరిష్కారంపై చర్చిస్తామని తెలిపారు. ఈమేరకు పురపాలక శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ ఓ ప్రకటన విడుదల చేశారు. పారిశుధ్య కార్మిక ఐక్య కార్యాచరణ సమితికి (జేఏసీ) కి ఆయన సమాచారం పంపించారు. హెల్త్ అలవెన్స్ మినహా మిగిలిన అన్ని డిమాండ్లను పరిష్కరిస్తామని మంత్రుల కమిటీ ఇదివరకే కార్మికులకు చెప్పింది. అయితే కార్మికులు హెల్త్ అలవెన్స్ విషయంలో పట్టుబడుతున్నారు. ప్రభుత్వం మాట వినకపోవడంతో సమ్మెకు దిగారు.
ఇప్పటి వరకూ హెల్త్ అలవెన్స్ రూపంలో నెలకు కార్మికులకు 6వేల రూపాయలు చెల్లించేవారు. దీంతోపాటు మొత్తం కార్మికులు 23 డిమాండ్లు ప్రభుత్వం ముందు ఉంచారు. దీంట్లో హెల్త్ అలవెన్స్ మినహా మిగతా హామీలు నెరవేరుస్తామని చెప్పారు మంత్రులు. కానీ కార్మికులు ఆ హామీ కూడా నెరవేర్చాల్సిందేనని పట్టుబట్టారు. ఇక్కడే చిన్న మెలిక పెట్టింది ప్రభుత్వం. గతంలో కార్మికుల వేతనం 12వేల రూపాయలుగా ఉండేది. వైసీపీ అధికారంలోకి వచ్చాక 6 వేల రూపాయలు హెల్త్ అలవెన్ ఇచ్చింది. దీంతో మొత్తంగా వారి చేతికి అందే డబ్బు 18వేల రూపాయలు అయింది. పీఆర్సీ సవరణతో జీతం 15వేలకు పెరిగిందని, అందుకే అదనంగా కేవలం 3వేల రూపాయలు మాత్రమే ఇస్తామని చెబుతోంది ప్రభుత్వం. దీనికి కార్మికులు ఒప్పుకోవడంలేదు.
సగంమందే పనిలోకి..
సమ్మెకు మద్దతుగా దాదాపు సగంమంది కార్మికులు విధులకు హాజరు కావడంలేదు. దీంతో మిగిలిన సగం మందితోనే పని జరుగుతోంది. నగరాల్లో ఎక్కడి చెత్త అక్కడే తనిపిస్తోంది. మున్సిపల్ కార్మికులు మిగతా వారి పని భారం కూడా తమపై పడుతోందని వాపోతున్నారు. అటు ప్రజలు కూడా పారిశుధ్య సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. మొత్తంగా మూడురోజులకే ఏపీలో ఎక్కడి చెత్త అక్కడే పేరుకుపోయింది. సమ్మె కారణంగా ప్రజలు అవస్థలు పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవట్లేదనే విమర్శ ఉంది. ఓవైపు చెత్త సేకరణ పేరుతో రుసుములు భారీగా పెంచారు, ఇప్పుడు ఎక్కడి చెత్త అక్కడే పేరుకుపోతోంది. దీన్ని ఎవరు తరలిస్తారో తేలాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: