చంద్రబాబుపై పోటీ విషయంలో స్పందించిన హీరో విశాల్..

Deekshitha Reddy
హీరో విశాల్ తన పొలిటికల్ ఎంట్రీపై స్పందించారు. ముఖ్యంగా చంద్రబాబుకి వ్యతిరేకంగా కుప్పం నియోజకవర్గం నుంచి ఆయన వైసీపీ తరపున పోటీ చేస్తారనే ప్రచారం ఇటీవల జోరుగా సాగింది. దీనిపై నటుడు విశాల్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. తనకు రాజకీయాలు ఆసక్తి లేదని తేల్చి చెప్పారు. అందులోనూ తాను చంద్రబాబుపై పోటీ చేస్తానంటూ ఎవరో కట్టుకథలల్లారని అంటున్నారు. ఇంతకీ విశాల్ రాజకీయ ప్రవేశంపై ఎవరు పుకార్లు వ్యాప్తి చేశారు, అసలు వారి ప్రయోజనం ఏంటి అనేది మాత్రం తేలాల్సి ఉంది.
2024 ఎన్నికల్లో కుప్పం నియోజకవర్గ వైసీపీ అభ్యర్థిగా సినీ నటుడు విశాల్‌ పోటీ చేస్తున్నారంటూ కొన్నిరోజులుగా సోషల్ మీడియాతోపాటు, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా ప్రచారం జరిగింది. అయితే విశాల్ పోటీ గురించి ముందుగా మంత్రి పెద్దిరెడ్డి స్పందించారు. కుప్పంలో విశాల్ పోటీ చేస్తారో లేదో తనకు తెలియదని, అయితే వైసీపీ పార్టీ అభ్యర్థిగా భరత్ పోటీ చేస్తారని క్లారిటీ ఇచ్చారు పెద్దిరెడ్డి. కుప్పంలో చంద్రబాబుకి వ్యతిరేకంగా పోటీ చేసేది భరత్ అంటూ స్పందించారు పెద్దిరెడ్డి. ఆ తర్వాత ఇప్పుడు విశాల్ కూడా ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు.

 
'ఆంధ్రప్రదేశ్‌లోని కుప్పం నియోజకవర్గంలో తాను పోటీ చేస్తున్నానంటూ వచ్చిన వార్తల్లో నిజం లేదన్నారు విశాల్. ఆ వార్తను తాను ఖండిస్తున్నట్టు చెప్పారు. రాజకీయ ప్రవేశంపై తనను ఇప్పటి వరకూ ఎవరూ సంప్రదించలేదని, అసలు ఇలాంటి వార్తలు ఎక్కడనుంచి ఎలావచ్చాయో తెలియదని అంటున్నారు విశాల్. ఈమేరకు ట్విట్టర్ వేదికగా స్పందించారాయన. ప్రస్తుతానికి తన ఫోకస్ అంతా సినిమాలపైనే ఉందని చెప్పుకొచ్చారు. ఏపీ రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చే ఉద్దేశం తనకు లేదన్నారు. కుప్పం నుంచి పోటీ చేస్తానని, చంద్రబాబుకి వ్యతిరేకంగా పోటీ చేస్తున్నాననే వార్తలు అసత్యం అని కొట్టిపారేశారు విశాల్. ప్రస్తుతం విశాల్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా లాఠీ విడుదలకు ముస్తాబవుతోంది. సునయ ఇందులో హీరోయిన్. ఇది యాక్షన్ ఓరియంటెడ్ మూవీ. వినోద్ కుమార్ ఈ సినిమాకు దర్శకుడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: