విక్రమ్ రెడ్డికి ఉన్న అతి పెద్ద మైనస్ అదే..!

Deekshitha Reddy
ఏపీలో ఉప ఎన్నిక నగారా మోగింది. దేశవ్యాప్తంగా వివిధ లోక్ సభ, అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసిం కేంద్ర ఎన్నికల సంఘం.. ఏపీలోని ఆత్మకూరుకి కూడా షెడ్యూల్ ఖరారు చేసింది. ఆత్మకూరులో దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి సోదరుడు మేకపాటి విక్రమ్ రెడ్డి వైసీపీ అభ్యర్థిగా బరిలో దిగబోతున్నారు. ఇప్పటికే కుటుంబం అంతా ఏకగ్రీవంగా విక్రమ్ రెడ్డి పేరుని ప్రతిపాదించగా, సీఎం జగన్ ఆమోదించారు. అయనను ఆత్మకూరు నియోజకవర్గ వైసీపీ ఇన్ చార్జిగా ప్రకటించారు. ప్రస్తుతం గడప గడప కార్యక్రమంలో ఆయన పాల్గొంటున్నారు.
ఇప్పటి వరకు ఆత్మకూరులో వైసీపీకి తిరుగులేదు. మేకపాటి గౌతమ్ రెడ్డిపై ఉన్న అభిమానం, ఆయన కుటుంబంపై ఉన్న సింపతీతో విక్రమ్ రెడ్డి విజయం నల్లేరుపై నడకేనని చెప్పాలి. కానీ ప్రస్తుతం ఏపీలో ఉన్న రాజకీయ పరిస్థితులు వైసీపీని కాస్త ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఎమ్మెల్సీ అనంతబాబు అరెస్ట్, ఆ తర్వాత అమలాపురం అల్లర్లు.. ఇలా వరుస సంఘటనలతో ఏపీలో అధికార పార్టీని టార్గెట్ చేస్తున్నాయి ప్రతిపక్షాలు. బాదుడే బాదుడు అంటూ జనాల్లోకి వెళ్తున్నాయి. దీని ప్రభావం ఉప ఎన్నికలపై ఎంతవరకు ఉంటుందో చూడాలి.
ఆత్మకూరు ఉప ఎన్నికల్లో బీజేపీ కచ్చితంగా పోటీ చేస్తుంది. ప్రధాన ప్రతిపక్షం టీడీపీ ఈ ఎన్నికలకు దూరంగా ఉండే అవకాశముంది. ఆమధ్య బద్వేల్ ఉప ఎన్నికల్లో కూడా దివంగత ఎమ్మెల్యే సతీమణికి టికెట్ ఇవ్వడంతో టీడీపీ పోటీనుంచి తప్పుకుంది. కేవలం బీజేపీ మాత్రమే పోటీ చేసింది. జనసేన కూడా ఎన్నికకు దూరం అని చెప్పింది. ఇప్పుడు ఆత్మకూరు విషయంలో కూడా టీడీపీ, జనసేన అదే ఆనవాయితీ కొనసాగించే అవకాశముంది. అయితే ఇక్కడ అధికార పార్టీని ఇబ్బంది పెట్టాలనుకుంటే మాత్రం టీడీపీ, జనసేన తమ అభ్యర్థుల్ని బరిలో దింపే అవకాశం కూడా ఉంది. లేదంటే మధ్యే మార్గంగా.. బీజేపీకి లోపాయికారీ మద్దతు ఇవ్వాల్సి ఉంటుంది. మొత్తమ్మీద బాదుడే బాదుడు అంటూ జనాల్లోకి వస్తున్న టీడీపీ.. తమ వాదన నిజం అని నిరూపించుకోవాలంటే.. ఆత్మకూరులో టఫ్ ఫైట్ ఇవ్వాల్సిందే. ఒకవేళ ఈ ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధిస్తే మాత్రం ఏపీలో జగన్ ప్రభుత్వానికే పూర్తి జనామోదం ఉందని అనుకోవాలి. రెండేళ్లలో ఎన్నికలు జరగాల్సిన వేళ.. ఆత్మకూరు ఉప ఎన్నిక వైసీపీకి కూడా ప్రతిష్టాత్మకంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: