ఏపీ ప్రభుత్వం ఉద్యోగుల్ని రెచ్చగొడుతోందా..?

Deekshitha Reddy
ఇప్పటికే ఏపీ ప్రభుత్వానికి, ఉద్యోగులకు మధ్య గ్యాప్ బాగా పెరిగిపోయింది. పీఆర్సీ అమలు విషయంలో ఉద్యోగుల డిమాండ్లు పూర్తి స్థాయిలో నెరవేరలేదు. కానీ సర్దుకుపోయారు, సమయం వచ్చినప్పుడు తమ సత్తా చూపిస్తామంటున్నారు. ఇప్పుడు సీపీఎస్ రద్దు విషయంలో కూడా ప్రభుత్వం పట్టుదలకు పోతోంది. గతంలో పాదయాత్రలో సీఎం జగన్ సీపీఎస్ రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక వారం లోపే రద్దు చేస్తామని గట్టిగా చెప్పారు. కానీ మూడేళ్లవుతున్నా సీపీఎస్ విధానం రద్దుకాలేదు. దీని బదులు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ కావాలంటున్నారు ఉద్యోగులు. కానీ ప్రభుత్వం మధ్యే మార్గంగా జీపీఎస్ తెస్తామంటోంది.
జీపీఎస్ తో లాభం లేదు..
మరోవైపు జీపీఎస్ తో ఎలాంటి లాభం లేదని, ఓపీఎస్ మాత్రమే కావాలంటున్నారు ఉద్యోగులు. ఈమేరకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రి వర్గ ఉప సంఘం చర్చలో కూడా ఇదే విషయాన్ని తేల్చి చెప్పారు. ఓపీఎస్ మినహా ఇంకేమీ వద్దంటున్నారు. అయితే దీనిపై ప్రభుత్వం మెట్టు దిగలేదు. సీపీఎస్ తో నష్టం ఉంటుందని ఉద్యోగులు చెప్పడం వల్లే తాము జీపీఎస్ ని రూపొందించామని, దీనివల్ల కూడా ఉద్యోగులకు ఎలాంటి నష్టం ఉండదని చెప్పారు.
ఓపీఎస్ అమలు చేస్తే..?
ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అమలు చేస్తే ప్రభుత్వంపై ఆర్థిక భారం పెరిగిపోతుంది. దాని బదులు జీపీఎస్ తీసుకొస్తే ఇరు వర్గాలకు సమన్యాయం చేసినట్టవుతుందనేది మంత్రుల వాదన. జీపీఎస్ ద్వారా ఉద్యోగులకు పెద్దగా నష్టం ఉండదని, అదే సమయంలో ప్రభుత్వంపై అదనపు భారం పడదని అంటున్నారు. ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల నేతలు అర్థం చేసుకోవాలని కోరారు. ఒకవేళ ప్రభుత్వం ఓపీఎస్ ని తిరిగి అమలు చేసినా ఇప్పటికిప్పుడు వచ్చే నష్టం లేదని, భవిష్యత్తులో అది పెద్ద ఆర్థిక సమస్య అవుతుందని చెబుతున్నారు సజ్జల రామకృష్ణారెడ్డి. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని తాము ఈ నిర్ణయం తీసుకున్నామని అన్నారు.
మొత్తమ్మీద సీపీఎస్ విషయంలో మరోసారి పీటముడి పడింది. ఉద్యోగులెవరూ జీపీఎస్ కి ఇష్టపడటంలేదు. తమకు సీపీఎస్ మాత్రమే కావాలంటున్నారు. అంటే ఒకరకంగా ప్రభుత్వం ఈ విషయంలో ఉద్యోగులతో ఎడబాటు పెంచుకుంటుందనే అనుమానం వస్తోంది. సీపీఎస్ విషయంలో పట్టుదలకు పోతే వచ్చే ఎన్నికల్లో ఉద్యోగ వర్గాలు వైసీపీకి దూరం జరిగే అవకాశముంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: