ఏపీలో బీఈడీ విద్యార్థులకు బిగ్ షాక్..

Deekshitha Reddy
ఉపాధ్యాయ విద్యలో ప్రవేశించాలంటే బీఈడీ, లేదా డీఈడీ తప్పనిసరి. అయితే ఈ ఏడాది కొత్తగా ఈ కోర్సుల్లో చేరాలనుకునేవారికి మాత్రం పెద్ద షాక్ తగులుతోంది. ఎందుకంటే ఏకంగా ఏపీలో 118 కాలేజీలలో ప్రవేశాలపై నిషేధం విధించారు. నాణ్యతా ప్రమాణాలు పాటించడంలేనందు వల్లే ఇలాంటి చర్యలు తీసుకున్నట్టు జాతీయ ఉపాధ్యాయ విద్యామండలి (NCTE) పేర్కొంది.
ఒక్క ఏపీలోనే కాదు, దేశవ్యాప్తంగా సుమారు 6 వేల కాలేజీల్లో ఈ ఏడాది అడ్మిషన్లు చేపట్టకూడదని తెలిపింది NCTE. పర్ఫామెన్స్ అప్రైజల్ రిపోర్ట్ ప్రతి ఏడాదీ జరిగే తంతు అయినా.. ఈసారి మాత్రం ఏకంగా 6వేల కాలేజీలు ఈ లిస్ట్ లో నివేదికలు సమర్పించకపోవడం విశేషం. దీంతో అప్రైజల్ లిస్ట్ సమర్పించని కాలేజీల అడ్మిషన్లపై ప్రభావం పడే అవకాశముంది. ప్రస్తుతానికి ఇది తాత్కాలిక ఇబ్బందే అయినా.. ఈ నిర్ణయం వల్ల కాలేజీల రెప్యుటేషన్ దెబ్బతినే ప్రమాదం ఉంది.
దేశవ్యాప్తంగా దాదాపు 17 వేల కాలేజీలు ప్రభుత్వ, ప్రైవేట్‌ యాజమాన్యాల పరిధిలో  బీఈడీ, డీఈడీ కోర్సులను అందిస్తున్నాయి. ప్రస్తుతం NCTE తీసుకున్న నిర్ణయం అమలైతే వాటిలో మూడోవంతు కాలేజీల్లో ఈ ఏడాది అడ్మిషన్లు ఉండవు. అంటే జీరో ఇయర్ ఉంటుందనమాట. వాటిలో కొన్ని ప్రభుత్వ కాలేజీలు కూడా ఉన్నాయి.
ఇక తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే.. తెలంగాణలో ప్రస్తుతం 206 బీఈడీ, 109 డీఈడీ కాలేజీలు ఉన్నాయి. వీటిలో 271 మాత్రమే అప్రైజల్ లిస్ట్ పంపించాయి. అంటే మిగతా 44 కాలేజీలలో ఈ విద్యాసంవత్సరం అడ్మిషన్లు ఉండవనమాట. ఏపీలో 521 బీఈడీ, డీఈడీ కాలేజీలున్నాయి. వాటిలో 403 మాత్రమే వచ్చే విద్యాసంవత్సరం కొనసాగుతాయి. 118 కాలేజీలలో ఈ ఏడాది అడ్మిషన్లు ఉండవని తెలుస్తోంది.
ఉపాధ్యాయ విద్యలో ప్రవేశించాలనుకునే వారికి నిజంగా అది అశనిపాతమే. అయితే ఇటీవల కాలంలో ఈ కోర్సులకి కూడా డిమాండ్ బాగా తగ్గింది. రెగ్యులర్ గా డీఎస్సీ నియామకాలు జరగకపోయే సరికి చాలామంది బీఈడీ, డీఈడీ కోర్సులనుంచి వెనక్కి తగ్గారు. అయితే ఇప్పుడు కాలేజీల సంఖ్య కూడా తగ్గడం మరో విశేషం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: