అమరావతి : ఈ కులాలను పక్కనపెట్టిన కారణమిదేనా ?

Vijaya



మంత్రివర్గం కూర్పు విషయంలో ఎవరి ఆనందం వారిది ఎవరి బాధ వారికుంది. ఉన్న మంత్రిపదవులు 25 కాబట్టే గెలిచిన వారందరినీ మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశం ఎలాగూ లేదు. అందుకనే వ్యక్తులను పరిగణలోకి తీసుకోకుండా వీలైనంతలో అన్నీ సామాజికవర్గాలకు ప్రాతినిధ్యం కల్పించేందుకు ప్రయత్నిస్తారు. ఇపుడు క్యాబినెట్ కూర్పులో జగన్మోహన్ రెడ్డి చేసిన కసరత్తు కూడా అలాంటిదే.



అయితే ఇక్కడ ఆశ్చర్యం ఏమిటంటే నాలుగు కులాలకు మంత్రివర్గంలో చోటు కల్పించకుండా పూర్తిగా పక్కనపెట్టేశారు. కమ్మ, క్షత్రియ, వైశ్య, బ్రాహ్మణ సామాజికవర్గాలకు ప్రాధాన్యత లేని మంత్రివర్గం బహుశా ఇదేనేమో. మొదటి క్యాబినెట్లో కూడా కమ్మ కులం తరపున కొడాలి నాని ఉండేవారు. క్షత్రియుల తరపున శ్రీరంగనాధరాజు, వైశ్య సామాజికవర్గం తరపున వెల్లంపల్లి శ్రీనివాస్ ప్రాతినిధ్యం వహించారు. బ్రాహ్మణ సామాజికవర్గం నుండి ఎవరికీ ప్రాధాన్యత దక్కలేదు.



ఇపుడు జగన్ క్యాబినెట్-2లో పై సామాజికవర్గాలకు తలా ఒకరికి ప్రాతినిధ్యం కల్పిస్తారనే అందరు అనుకున్నారు. బ్రాహ్మణ సామాజికవర్గానికి కూడా కొత్తగా చోటు కల్పిస్తారనే ప్రచారం జరిగింది. అయితే విచిత్రంగా అసలు పై నాలుగు కులాలకు చోటే కల్పించలేదు. మొన్నటి ఎన్నికల్లో బ్రాహ్మణ సామాజికవర్గం ఓట్లు వైసీపీకి పెద్దగా పడలేదన్నది వాస్తవం. బ్రాహ్మణ కులంలోని వారికి జగన్ నాలుగు టికెట్లిచ్చినా ఓట్లు మాత్రం పెద్దగా పడలేదు. కాబట్టే బ్రాహ్మణ సామాజికవర్గంకు ప్రాతినిధ్యం కల్పించకపోయినా పర్వాలేదని జగన్ అనుకునుండచ్చు. మిగిలిన సామాజికవర్గాలపైన కూడా జగన్ కు అనుమానం వచ్చుండచ్చు. అందుకనే మంత్రివర్గం నుండి దూరం పెట్టేసినట్లున్నారు. 




ఇక కమ్మ సామాజికవర్గం కూడా టీడీపీని కాదని వైసీపీకి మద్దతిచ్చేది తక్కువే. అయితే క్షత్రియులు, వైశ్యులు మొన్నటి ఎన్నికల్లో వైసీపీకి గట్టి మద్దతే ఇచ్చాయి. అయినా క్షత్రియ, వైశ్య సామాజికవర్గాలను ఎందుకు పక్కనపెట్టేశారో అర్ధం కావటంలేదు. మొన్నటి ఎన్నికల్లో మద్దతివ్వని వాళ్ళు వచ్చే ఎన్నికల్లో కూడా ఇవ్వరని అనుకున్నా అర్ధముంది. కానీ మొన్నటి ఎన్నికల్లో మద్దతిచ్చిన క్షత్రియ, వైశ్య సామాజికవర్గాలను కూడా జగన్ పక్కనపెట్టేయటమే ఆశ్చర్యంగా ఉంది.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: