కమలం వర్సెస్ కారు.. పసుపు బోర్డ్ కై పోరు.. గెలిచేదెవరు..!

MOHAN BABU
నిజామాబాద్ లో కారు వర్సెస్ కమలం స్టార్ట్ అయిందా ? పసుపు బోర్డు అంశంలో రచ్చ తప్పేలా లేదా ?
నిజామాబాద్ జిల్లాలో ఎన్నికలకు ముందే బిజెపి పార్టీకి టిఆర్ఎస్ పార్టీ కి మధ్య వార్ మొదలైంది. స్థానిక ఎంపీ అరవింద్ పర్యటనను ఆర్మూర్ నియోజకవర్గంలో అడ్డుకున్నారు. ఓ వైపు పసుపు రైతులు టిఆర్ఎస్ శ్రేణులు మరోవైపు కమలం శ్రేణులు ఎవరికివారే ధర్నాలు, రాస్తారోకోలు చేపట్టారు. బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ మరియు పార్టీ శ్రేణులపై రాళ్లు రువ్వారు. ఈ దాడుల్లో ఎంపీ కారు అద్దాలు ధ్వంసమయ్యాయి.

ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఎంపీ అరవింద్  నిలబెట్టుకోవాలని ఎమ్మెల్యే జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆర్మూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే జీవన్ రెడ్డిని ఓడించి గుణపాఠం చెబుతానని ఎంపీ అరవింద్ వ్యక్తం చేశారు. నిజామాబాద్ జిల్లాలో పసుపు బోర్డు వివాదం దశాబ్దాలుగా సాగుతోంది. ఎన్నికల సమయంలోనే పసుపు బోర్డు తెరపైకి వస్తుంది. ఎన్నికల తర్వాత ఆ విషయంలో ఎవరూ స్పందించే వారు కాదు. అయితే 2019 పార్లమెంట్ ఎన్నికల్లో సుమారు 185 మంది పసుపు రైతులు నామినేషన్ వేశారు. దీంతో పసుపు బోర్డు సమస్య దేశ రాజకీయాల్లో చర్చకు వచ్చింది. అయితే నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీచేసిన ధర్మపురి అరవింద్ ఒక అడుగు ముందుకు వేసి తనను ఎంపీగా గెలిపిస్తే పసుపు బోర్డు తీసుకువస్తానని లేకుంటే తన ఎంపీ పదవికి రాజీనామా చేసి పోరాటం చేస్తానని బాండ్ పేపర్ పై రాసి పసుపు రైతులకు ఇచ్చారు. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి ఓటు వేస్తే పసుపు బోర్డు వస్తుందేమోనని భావించిన రైతులు బిజెపికి ఓటు వేసి ధర్మపురి అరవింద్ ను ఎంపీగా గెలిపించారు. అయితే ఎంపీగా గెలిచి రెండున్నరేళ్ల అవుతున్నా పసుపు బోర్డు రాలేదు. ఇంకా బోర్డు తీసుకురాలేదని పసుపు రైతులు, టిఆర్ఎస్ శ్రేణులు మండిపడుతున్నారు.

ఆర్మూర్, బాల్కొండ నియోజకవర్గాల్లోనే పసుపు రైతులు ఎక్కువగా ఉన్నారు. పసుపు బోర్డు ఏర్పాటు కోసం ఆర్మూర్ వేదికగా ఎన్నో పోరాటాలు జరిగాయి. రైతుల పోరాటాన్ని అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల్లో వాడుకొని వదిలేసారనేది  జగమెరిగిన సత్యం. అయితే ఎంపీ అరవింద్ మాత్రం పసుపు బోర్డు కంటే స్పైసీ బోర్డు మెంబర్ తీసుకువచ్చానని చెబుతున్నారు. పసుపును సుగంధ ద్రవ్యాలలో చేర్చడంతో పసుపు బోర్డు రాలేదని ఎంపీ వాదన. అయితే ఈ విషయం మాకు తెలియదని,మాకు మాత్రం పసుపు బోర్డు కావాలని పసుపు రైతులు, టిఆర్ఎస్ నేతలు పట్టుబడుతున్నారు. ఈ విషయంలో ఎంపీ అరవింద్ కి ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కి మధ్య రాజకీయ పోరు జరుగుతుంది. పసుపు బోర్డు తెస్తానని మూడేళ్లక్రితం హామీ ఇచ్చి  ఇప్పటివరకు పట్టించుకోలేదని జీవన్ రెడ్డి విమర్శించారు. టిఆర్ఎస్ ను విమర్శించే ముందు రైతులకు ఎంపీ సమాధానం చెప్పాలని హితువు పలికారు. మొత్తం మీద ఇద్దరు నాయకుల మధ్య పోరు మున్ముందు ఎలాంటి రాజకీయ పరిణామాలకు దారి తీస్తుందో వేచి చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: