మోదీ-షా జోడీకి యోగీ షాక్..!

Podili Ravindranath
యోగీ ఆదిత్యానాథ్... ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో 2017లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అనూహ్య విజయం సాధించడంతోనే.. యోగీ పేరు వెలుగులోకి వచ్చింది. అప్పటి వరకు కేవలం పార్లమెంట్‌కు మాత్రమే పరిమితం అయిన యోగీ ఆదిత్యానాథ్... తొలిసారి యూపీ అసెంబ్లీలో కాలు పెట్టారు. యూపీ ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యానాథ్ పేరును ప్రధాని నరేంద్రమోదీకి స్వయంగా నాటి పార్టీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా సూచించారు. దాంతో యోగిని బీజేపీ శాసనసభా పక్ష సమావేశంలో ఏకగ్రీవంగా కమలం పార్టీ ఎమ్మెల్యేలంతా ఎన్నుకున్నారు. నాటి నుంచి తనదైన శైలిలోనే దూకుడు ప్రదర్శించారు యోగీ ఆదిత్యానాథ్. అయితే ప్రస్తుతం తనకు ముఖ్యమంత్రిగా అవకాశం ఇచ్చిన మోదీ - షా జోడికే షాకులు ఇస్తున్నారు యోగి ఆదిత్యానాథ్. గతంలో పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉన్న యోగి... ఎన్నికల సమయంలో మాత్రం తాను అనుకున్నదే చేస్తున్నారు. చివరికి ప్రధాని మోదీ చేసిన సూచనలను కూడా బేఖాతరు చేస్తున్నారు.
తొలి నుంచి యోగీ సొంత నియోజకవర్గం గోరఖ్ పూర్. గతంలో మూడు సార్లు కూడా గోరఖ్ పూర్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచే యోగీ లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించారు. అయితే ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం అయోధ్య అంశాన్ని బీజేపీ అగ్ర నాయకత్వం హైలైట్ చేసేందుకు తీవ్రంగా కృషి చేస్తోంది. అయోధ్యలో రామ మందిరం వివాదానికి ప్రస్తుతం పరిష్కారం లభించింది. రామాలయ నిర్మాణం కూడా ప్రారంభమైంది. దీంతో... ఈ విషయాన్ని ప్రత్యేకంగా ప్రచారం చేయాలని బీజేపీ నేతలు భావిస్తున్నారు. అందుకోసం యోగీ ఆదిత్యానాథ్‌ను అయోధ్య అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలోకి దింపాలని మోదీ భావించారు. కానీ యోగీ మాత్రం... అందుకు ససేమిరా అనేశారు. తనను మొదటి నుంచి ఆదరిస్తున్న గోరఖ్ పూర్ నుంచే పోటీ చేసేందుకు రెడీ అయ్యారు. ఈ విషయంపై మోదీ - షా జోడీ స్వయంగా మంతనాలు జరిపినప్పటికీ... యోగీ ఆదిత్యానాథ్ మాత్రం ససేమిరా అనేశారు. దీంతో ఎప్పుడో మార్చి 7వ తేదీన చివరి విడతలో జరగనున్న గోరఖ్ పూర్ నియోజకవర్గం అభ్యర్థిని ఇప్పుడే ప్రకటించింది కాషాయ పార్టీ. అన్నీ అనుకూలంగా ఉన్నాయని భావిస్తున్నా.. యోగీని కట్టడి చేసేందుకు బీజేపీ అగ్రనేతలు తీవ్రంగా శ్రమించాల్సి వస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: