గెలుపే లక్ష్యంగా బిజెపి ఆపరేషన్ ఆకర్ష్..వీరే టార్గెటా..!

MOHAN BABU
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీజేపీ నేతలు ప్రత్యేక కార్యాచరణను సిద్ధం చేస్తున్నారు. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కమలం పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు కసరత్తులు చేస్తున్నారు.ఇదే విషయమై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఈ నేపథ్యంలో బీజేపీ నేతలు ఆపరేషన్ ఆకర్ష్ కు శ్రీకారం చుట్టారు. ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాల్లో చేరికలపై పూర్తిస్థాయిలో దృష్టి సారించారు. ఇందుకు ప్రత్యేక కమిటీలను సైతం ఏర్పాటు చేశారు. జాయినింగ్స్ అండ్ కో-ఆర్డినేషన్ కమిటీ చైర్మన్ గా ఇంద్రసేనా రెడ్డిని, సమన్వయ కమిటీ చైర్మన్ గా జితేందర్ రెడ్డిని, ఎస్టి కమిటీకి చైర్మన్ గా మాజీ ఎంపీ గరికపాటి మోహన్ రావును రాష్ట్ర అధిష్ఠానం నియమించింది. రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ అసెంబ్లీ నియోజకవర్గాలపై బీజేపీ ప్రత్యేక దృష్టి సారించింది.

 ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను వాడుకోవాలని, జిల్లాల వారిగా అది నేతలకు అధిష్టానం ఆదేశాలిచ్చింది. ఇతర పార్టీల్లో అసహనంతో ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలతో పాటు పారిశ్రామిక వేత్తలు, విద్యావేత్తలు, యువకులను కమలం పార్టీ టార్గెట్ గా పెట్టుకుంది. పార్టీ కార్యక్రమాలను సమన్వయం చేసేందుకు దళిత, గిరిజన, రిజర్వ్డ్ అసెంబ్లీ స్థానాలకు సమన్వయ కమిటీని నియమించి జోష్ పెంచింది. సీనియర్ నేతలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పాత, కొత్త నేతల కలయికతో పార్టీని సమన్వయం చేయడమే ఈ కమిటీలో ముఖ్య ఉద్దేశ్యంగా ఉన్నట్లు తెలుస్తోంది.

 రెండేళ్ల పాటు ఎస్సీ, ఎస్టీ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆయా సమన్వయ కమిటీలు పర్యటిస్తూ బీజేపీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేలా ప్లాన్ చేశారు.బూత్ స్థాయి మొదలు గ్రామ, మండల,నియోజకవర్గ స్థాయిలో పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉంది..? నేతల పనితీరుతో పాటు వారి మధ్య సమన్వయం ఎలా ఉంది..? అనే అంశాలపై అధ్యయనం చేస్తాయి. అలాగే క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితి, పార్టీ బలోపేతానికి చేపట్టాల్సిన కార్యక్రమాలపై కార్యాచరణను రూపొందించి, రాష్ట్ర నాయకత్వానికి అందజేయనున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: