పాపం యోగీ మహరాజ్... మరి ఇన్ని ఆరోపణలా...!

Podili Ravindranath
నిన్న మొన్నటి వరకు తమదే విజయం అనుకున్నారు. వేల కోట్ల అభివృద్ధి పనులే తమను గెలిపిస్తాయని గట్టి నమ్మకంతో ఉన్నారు. మరీ ముఖ్యంగా తమ ముఖ్యమంత్రి పనితీరు సూపర్ డూపర్ అంటూ పొగడ్తలతో ముంచెత్తారు కూడా. మరోవైపు సర్వేలు కూడా తమకే అనుకూలంగా ఉండటంతో.... యూపీలో తమకు తిరుగే లేదని భారతీయ జనతా పార్టీ నేతలు, కార్యకర్తలు, సానుభూతి పరులు కాలర్ ఎగురవేశారు కూడా. కానీ కేవలం 48 గంటల్లోనే సీన్ మొత్తం రివర్స్ అయ్యింది. నిన్న మొన్నటి వరకు పార్టీలో కీలకంగా వ్యవహరించిన నేతలంతా ఇప్పుడు కమలం పార్టీకి గుడ్ బై చెబుతున్నారు. రెండు రోజుల్లోనే ఏకంగా పది మంది వరకు ముఖ్యనేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీలు కషాయా కండువా తీసి పక్కన పెట్టారు. యోగీ సారధ్యంపై ఇప్పుడు తీవ్ర ఆరోపణలు కూడా చేస్తున్నారు. పైగా ఈ సమయంలో బయటకు వచ్చిన నేతలపై ఎప్పుడో ఏడేళ్ల క్రితం కేసులో నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయడంతో మరో దుమారానికి తెర లేపింది బీజేపీ.
ఉత్తరప్రదేశ్ రాష్ట్ర శాసనసభకు జరుగుతున్న ఎన్నికల్లో ఫస్ట్ లిస్ట్ రాకముందే అధికార భారతీయ జనతా పార్టీకి గట్టి షాకులు తగులుతున్నాయి. ఇద్దరు మంత్రులు, ఎమ్మెల్యేలు బయటకు వెళ్లిపోవడంతో.... బీజేపీని కార్నర్ చేసేలా ఇతర పార్టీల నేతలు ఇప్పుడు కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ప్రతిపక్షాలతో పాటు బీజేపీ మిత్రపక్షమైన సుహేల్ దేవ్ భారతీయ సమాజ్ పార్టీ నేత ఓపీ రాజ్ భర్ కూడా బీజేపీ పైన ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఓబీసీలకు బీజేపీ శత్రువులా మారిందని ఎస్‌బీఎస్‌పీ నేత రాజ్ భర్ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం బీజేపీ వీడి వెళ్లిన వారి గురించి ప్రస్తావిస్తూ... రాబోయే రోజుల్లో మరింత మంది నేతలు బీజేపీకి గుడ్ బై చెప్పేందుకు సిద్ధంగా ఉన్నట్లు తమ దగ్గర పక్కా సమాచారం ఉందన్నారు రాజ్ భర్. గతంలో బీజేపీతో జత కట్టిన ఎస్‌బీ‌ఎస్‌పీ నేత రాజ్ భర్... ఇప్పుడు అఖిలేష్ నేతృత్వంలోని సమాజ్ వాదీ పార్టీతో పొత్తు పెట్టుకున్నారు. బీజేపీ నుంచి అసంతృప్తి ఓబీసీ నేతలను తమ వైపు తిప్పుకోవడంలో రాజ్ భర్ కీలక పాత్ర పోషిస్తున్నారు. సరిగ్గే రెండేళ్ల క్రితం యోగీ సర్కార్‌లో కేబినెట్ పదవికి రాజ్ భర్ రాజీనామా చేశారు. రాజ్ భర్ వ్యాఖ్యలు ప్రస్తుత బీజేపీ నేతలను మరింత కలవరపరుస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: