దోస్తీ అంటున్న టీడీపీ, బీజేపీ నేతలు...!

Podili Ravindranath
చిరకాల మిత్రులు కొద్ది రోజులుగా శత్రువులుగా మారారు. ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకున్నారు. ఇంకా చెప్పాలంటే... ఇక భవిష్యత్తులో కలిసేదే లే అన్నట్లుగా తయారయ్యారు. ఇప్పుడు మళ్లీ వాళ్లిద్దరు ఒకటయ్యేలా కనిపిస్తున్నారు. ఆ ఇద్దరే తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ. ఎంతో కాలంగా కలిసి ప్రయాణం చేస్తున్న టీడీపీ, బీజేపీ నేతలు... సరిగ్గా 2019 సార్వత్రిక ఎన్నికలకు ఏడాది ముందు విడిపోయారు. 2014లో రెండు పార్టీలు జత కలిసి పోటీ చేసిన సైకిల్, కమలం పార్టీలు... ఘన విజయం సాధించాయి. రెండు పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేశాయి. ప్రత్యేక హోదా విషయంలో వైసీపీ ట్రాప్‌లో పడిన టీడీపీ... చివరికి తమ చిరకాల దోస్తీకి బ్రేక్ కొట్టింది. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో ఎవరి దారి వారిదే వారే అన్నట్లుగా పోటీ చేశారు. చివరికి రెండు పార్టీలు ఘోరంగా విఫలమయ్యాయి. పిట్ట పోరు పిట్ట పోరు పిల్లి తీర్చిందనే సామెతగా... రెండు పార్టీల గోడవ... వైసీపీకి లాభం చేసింది. అనూహ్య మెజారిటీతో వైసీపీ ఏకంగా 151 స్థానాలతో అధికారం చేపట్టింది.
ఇక సార్వత్రిక ఎన్నికలకు సరిగ్గా రెండేళ్లు సమయం ఉన్న నేపథ్యంలో ఏపీలో రాజకీయం వేగంగా మారుతోంది. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించేందుకు విపక్షాలు కంకణం కట్టుకున్నాయి. ప్రస్తుతం వైసీపీతో సమదూరం పాటిస్తున్న టీడీపీ, బీజేపీలు ఇప్పుడు తమ రూటు మార్చుకున్నట్లుగా కనిపిస్తోంది. వైసీపీ ప్రభుత్వంపై రెండు పార్టీలు కలిసి ఉమ్మడిగా యుద్ధం ప్రకటిస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు విడివిడిగా పోరాటం చేసిన రెండు పార్టీలు... ప్రభుత్వంపై ఉన్న ప్రజా వ్యతిరేకతను కలిసి సొమ్ము చేసుకోవాలని భావిస్తున్నాయి. కొద్ది రోజులుగా బీజేపీ అగ్రనేతలు సైతం టీడీపీని కనీసం ఒక్క మాట కూడా అనటం లేదు. పైగా తమ ప్రధాన శత్రువు కేవలం వైసీపీ మాత్రమే అని ప్రకటిస్తున్నారు. దీంతో ఇప్పుడు అధికార వైసీపీలో కాస్త కలవరం మొదలైనట్లు కనిపిస్తోంది. ఇందుకు నిన్నటి ప్రభుత్వ ప్రధాన సలహాదారుల సజ్జల రామకృష్ణా రెడ్డి ప్రెస్ మీట్ ఉదాహరణ అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. చంద్రబాబు రాసిన స్క్రిప్ట్ బీజేపీ నేతలు చదువుతున్నారని సజ్జల కామెంట్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: