ఢిల్లీకి సైనికాధికారుల భౌతికకాయాలు..ఎప్పుడంటే !

NAGARJUNA NAKKA
తమిళనాడులో హెలికాప్టర్ కూలిన ఘటనలో మరణించిన బిపిన్ రావత్ సహా ఇతర సైనికాధికారుల భౌతిక కాయాలను గురువారం ఢిల్లీకి తరలించనున్నారు. ఈ రాత్రికి వారి పార్థీవదేహాలు తమిళనాడులోని వెల్లింగ్టన్ ఆర్మీ ఆస్పత్రిలోనే ఉండనున్నాయి. రేపు సాయంత్రం ఢిల్లీకి చేరుకునే అవకాశముంది. అటు హెలికాప్టర్ ప్రమాదంపై రేపు ఉదయం 11గంటలకు రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ లోక్ సభలో, రాజ్యసభలో ప్రకటన చేయనున్నారు.
తమిళనాడులో జరిగిన సైనిక ఘోర హెలికాప్టర్ ప్రమాదంలో మొత్తం 13మంది మరణించారు. వీరిలో సీడీఎస్ బిపిన్ రావత్, ఆయన సతీమణి మధులికతో పాటు.. బ్రిగేడియర్ ఎల్ఎస్ లిద్దార్, లెఫ్టినెంట్ కల్నర్ హెచ్ సింగ్, వింగ్ కమాండర్ పీఎస్ చౌహాన్, స్క్వాడ్రన్ లీడ్ కె సింగ్, జేడబ్ల్యూఓలు దాస్, ప్రదీప్, హవల్దార్ లు సత్పాల్ ఉన్నారు. అలాగే.. నాయక్ లు గురుసేవక్ సింగ్, జితేందర్, లాన్స్ నాయక్ లు సాయితేజ, వివేక్ ఈ ప్రమాదంలో మృతి చెందారు.
తమిళనాడు హెలికాప్టర్ లో ప్రమాదంలో మరణించిన చిత్తూరు జిల్లాకు చెందిన సైనికుడు సాయితేజ సోదరుడు కూడా ఆర్మీలోనే పనిచేస్తున్నారు. ప్రస్తుతం ఆయన సిక్కింలో బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. వీరి తల్లిదండ్రులు కురుబలకోటలో వ్యవసాయం చేసుకుంటున్నారు. వాళ్లది మధ్యతరగతి కుటుంబం. 27ఏళ్ల వయసులో మృత్యుఒడికి చేరుకున్నారు సాయితేజ. దీంతో కురబలకోటలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సాయితేజకు భార్య శ్యామల, కుమారుడు మోక్షజ్ఞ, కూతురు దర్శిని ఉన్నారు. 1994లో జన్మించిన సాయితేజ 2013లో ఆర్మీ సిఫాయిగా చేరారు. పరీక్షల్లో పాస్ అయి పారా కమెండోగా ఎంపికయ్యారు. ఈ ఉదయమే వీడియో కాల్ చేసి పిల్లలతో మాట్లాడారని కుటుంబ సభ్యులు తెలిపారు.

దేశానికి సేవలందించిన హీరో బిపిన్ రావత్ అని కొనియాడారు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్. బిపిన్ రావత్ మృతి దేశానికి తీరని లోటుగా కేంద్ర రక్షశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అభివర్ణించారు. ఈ రోజు దేశానికి చాలా విచారకరమైన రోజన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా.  
 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: