తిడితే తిట్టించుకోవాలి.. ఏపీలో ఉద్యోగుల పరిస్థితి దారుణం..

Deekshitha Reddy
ఏపీలో ప్రభుత్వ ఉద్యోగుల పట్ల అధికార పార్టీ నేతల వ్యవహార శైలిలో ఇటీవల స్పష్టంగా మార్పు వచ్చినట్టు తెలుస్తోంది. వీఆర్వోలపై మంత్రి అప్పలరాజు చేసిన కామెంట్లపై రెవెన్యూ సంఘాలు భగ్గుమన్నాయి. ఈ ఏపిసోడ్ లో కేవలం మున్సిపల్ కమిషనర్ తో క్షమాపణ చెప్పించారంతే. మంత్రి అప్పలరాజు అసలు సీన్ లోకి రాలేదు. పోనీ ప్రభుత్వం తరపున ఎవరైనా ఈ అంశంపై రియాక్ట్ అయ్యారా అంటే అదీ లేదు. అసలు అప్పలరాజు ఎపిసోడ్ పై అధికార పార్టీనుంచి కనీస స్పందన కూడా లేదు. అంటే పరోక్షంగా ఆయన వ్యాఖ్యల్ని అందరూ సమర్థించినట్టే లెక్క. ఇదే సమయంలో వీఆర్వోలు మాత్రం మంత్రి క్షమాపణ చెప్పే వరకు తమ పోరాటం ఆపేది లేదంటున్నారు. ఇక్కడే అధికార పార్టీ తెలివి చూపించింది. కమిషనర్ చెప్పిన సారీతో వీఆర్వో సంఘాలలోని ఓ వర్గం ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టామని ప్రకటించింది. అయితే ఆ వర్గం వెనక ఎవరున్నారో అందరికీ తెలిసిన విషయమే.
తాజాగా తూర్పుగోదావరి జిల్లా అయినవిల్లి మహిళా ఎంపీడీవోపై వైసీపీ నాయకుడిగా చెబుతున్న వాసం శెట్టి తాతాజీ అనే ఓ మాజీ సర్పంచ్ అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఏకవచనంతో సంబోధించడమే కాకుండా, వేలు చూపించి మరీ బెదిరించారనే వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ ఘటన జరిగిన తర్వాత ఎంపీడీవోల సంఘం ఆందోళనలకు సిద్ధమవుతున్నా ఇంతవరకు ప్రభుత్వం తరపున స్పందన లేదు.
పోనీ వాసం శెట్టి తాతాజీ అనే వ్యక్తి వైసీపీకి చెందినవారు కాదనుకుందాం. కానీ ఓ ఎంపీడీవో ఆఫీస్ లోకి వెళ్లి ఉద్యోగి విధులకు భంగం కలిగించే దిశగా ఆయన ప్రవర్తన ఉంది అనుకుంటే.. కనీసం ఆయనపై కేసు నమోదు చేయాలి కదా. మరి అక్కడ పోలీసులు కంప్లయింట్ కోసం వేచి చూస్తున్నారా..? అధికార పార్టీ నేత అనే సరికి వెనకడుగు వేశారా..?
ఇటీవల ఓటీఎస్ విషయంలో కూడా ప్రభుత్వం ఒకలా, అధికారులు మరోలా చెప్పడం గందరగోళానికి దారితీస్తోంది. ఓటీఎస్ స్వచ్ఛందమేనంటూ ఎక్కడికక్కడ నేతలు ప్రకటనలు చేస్తున్నారు. దీంతో ప్రజలు ఇప్పుడెందుకొచ్చిన గొడవ అంటూ వెనకడుగు వేస్తున్నారు. మరోవైపు అధికారులు మాత్రం టార్గెట్ ప్రకారం పనిచేయాలని అంటున్నారు. ఈ దశలో ఓ పంచాయతీ సెక్రటరీ పొరపాటున స్టేట్ మెంట్ ఇచ్చి సస్పెండ్ అయ్యారు కూడా. నెల్లూరు జిల్లాలో ఓ మహిళా ఎంపీడీవో.. వాట్సప్ లో పెట్టిన ఆడియో మెసేజ్ వివాదాస్పదం కావడంతో  ఆమెకు షోకాజ్ నోటీస్ అందించారు. ఓటీఎస్ విషయంలో కింది స్థాయి ఉద్యోగులు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారనేమాట మాత్రం వాస్తవం. మరోవైపు పీఆర్సీ, సీపీఎస్ రద్దుకోసం ఉద్యోగ సంఘాలు పోరుబాట పట్టాయి. ఈ దశలో ఉద్యోగుల విషయంలో ప్రభుత్వం చేతులు కాలక ముందే దిద్దుబాటు చర్యలు చేపట్టడం మంచిదనే అభిప్రాయాలు వినపడుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: