వరంగల్: ఈసారి కూడా ఎమ్మెల్సీ ఇతనేనా..!

MOHAN BABU
గులాబీ పార్టీకి మెజారిటీ ఉన్న పోరు అనివార్యం కానుందా? ఇతర పార్టీల నుంచి అభ్యర్థులను ఎంపిక చేయడానికి జరుగుతున్న కసరత్తు ఎంతవరకు వచ్చింది..? హుజురాబాద్ ఫలితం దెబ్బతో అలర్టైన హైకమాండ్ ఎంపిక ప్రక్రియలో ఆచితూచి అడుగులు వేస్తోందా..? ఇంతకీ ఉమ్మడి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ లో ఎంపిక అయ్యేది ఎవరు..? స్థానిక సంస్థల శాసనమండలి ఎన్నికల కు సైరన్ మోగడంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎన్నికల హడావిడి మొదలైంది. సరిగ్గా నెల రోజుల్లో ఎన్నిక ప్రక్రియ పూర్తి కానుంది. వచ్చే నెల 10న నిర్వహించనున్న ఎమ్మెల్సీ ఎన్నికలకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో తమకే మెజారిటీ సీట్లు ఉన్నందున ఎన్నిక ఏకపక్షం అనే అంచనాతో గులాబీ తమ్ముళ్లు గెలుపుపై ధీమా తో ఉన్నారు. 2014లో టిఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉమ్మడి వరంగల్ జిల్లా లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి రెండు సార్లు ఎన్నికలు జరిగాయి.

మొదటిసారి 2016లో జనవరి 4న జరిగిన ఎన్నికల్లో కొండా మురళీ టిఆర్ఎస్ తరఫున విజయం సాధించారు. 2018లో కొండా దంపతులు గులాబీ కి రామ్ రామ్ చెప్పేసి కాంగ్రెస్ లో చేరటం ఆ వెంటనే కొండా మురళి రాజీనామా చేయడం 2019 జూన్ 3న జరిగిన ఎన్నికల్లో పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి టిఆర్ఎస్ పక్షాన ఎమ్మెల్సీగా విజయం సాధించడం  జరిగిపోయాయి. అయితే 2022 జనవరి 4తో  శ్రీనివాస్ రెడ్డి పదవీ కాలం  ముగియనుండడంతో ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ ఇచ్చింది. అయితే ఎమ్మెల్సీ అభ్యర్థిగా మరోమారు పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ని ప్రకటించడానికి సీఎం కేసీఆర్ డిసైడ్ అయినట్లు సమాచారం. పోచంపల్లి ఇప్పటివరకు రెండేళ్లు ఎమ్మెల్సీ గా ఉండగా తిరిగి  ఎమ్మెల్సీగా మరోసారి పోటీలోకి దిగనున్నారు. ఎమ్మెల్యేగా పోచంపల్లికే ఉమ్మడి జిల్లాలో శ్రేణులన్నీ మద్దతు పలుకుతున్నాయి. ఈ పోటీలో తమ ఉనికిని చాటుకునేందుకు బిజెపి, కాంగ్రెస్ కూడా  అభ్యర్థులను బరిలోకి దింపే యోచనలు ఉన్నాయట. ఎన్నికల్లో కూడా తమ సంఖ్యా బలం తక్కువే అయినా కాంగ్రెస్ తరపున అభ్యర్థిని పోటీలో నిలిపారు. ఈసారి రెండు పార్టీలు తమ అభ్యర్థులను  నామమాత్రంగా బరిలోకి దింపే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో క్యాంపు రాజకీయాలు తెరలేవనున్నాయట. కాకపోతే ఈసారి ఎన్నికలను ఏకగ్రీవం చేయడానికి టిఆర్ఎస్ ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఇందుకోసం ఇప్పటికే మంతనాలు  కూడా జరుగుతున్నాయట. మరి గులాబీ బాస్ ఈ ప్రయత్నంలో  ఏ మేరకు సక్సెస్ అవుతారో వేచి చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: